పాపం టీడీ తాతయ్య.. పట్టించుకునేవారు లేరే ..!
నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే.. వారిదే పెత్తనం ఉంటుంది. లేదా వారి కుటుంబాలకు చెందిన వారు కొన్ని నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తున్నారు.
By: Tupaki Desk | 3 May 2025 11:16 AMఆయన సీనియర్ ఎమ్మెల్యే. గత ఏడాది ఎన్నికల్లోనూ పోరాడి విజయం దక్కించుకున్నారు. కానీ.. ఆయన పరిస్థితి చూస్తున్న వారు.. ఆయనను తలుచుకుంటున్నవారు.. `పాపం` అని వ్యాఖ్యానిస్తున్నారు. కొందరైతే.. నేరుగా ఆయనతోనే కలిసి.. ఇలా జరుగుతుంటే చూస్తూ ఎలా ఉంటారు? అని కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ.. ఇతర నాయకుల మాదిరిగా ఆయన నోరు పెట్టుకుని అరవలేరు. అధిష్టానానికి పదే పదే ఫిర్యాదులు చేసి.. చెవిలో జోరీగలా కూడా మారలేరు. దీంతో ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ఇంతకీ.. ఆయన ఎవరంటే.. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట ఎమ్మెల్యే.. శ్రీరాం రాజగోపాల్. ఉరఫ్ తాతయ్య.
నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే.. వారిదే పెత్తనం ఉంటుంది. లేదా వారి కుటుంబాలకు చెందిన వారు కొన్ని నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తున్నారు. అయితే.. జగ్గయ్యపేటలో దీనికి విరుద్ధంగా ఉంది. గతంలో ఎప్పుడో ఒకటి రెండు సార్లు విజయం దక్కించు కుని ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా కేవలం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైన సీనియర్లు ఇద్దరు.. ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. వారు ముందు వెళ్తుంటే.. ఎమ్మెల్యే అయి.. 54 శాతం ఓటు బ్యాంకు దక్కించుకుని.. జనాలతో జేజేలు కొట్టించుకుంటున్న శ్రీరాం రాజగోపాల్ మాత్రం వారి వెనుక చేతులు కట్టుకుని సాగుతున్నారు.
వారిలో కీలకమైన నాయకుడు.. ప్రస్తుతం చంద్రబాబు దగ్గర మంచి మార్కులు ఉన్న నెట్టెం రఘురాం ఒకరు. ఈయన చెప్పిందే అధికారులు కూడా వింటున్నారు. అప్రతిహతంగా ఆయన ఇక్కడ చెలరేగిపోతున్నారని..టీడీపీ నాయకులు కూడా వ్యాఖ్యాని స్తున్నారు. ఎక్కడ ఏ పనికావాలన్నా.. ఎమ్మెల్యేకు బదులుగా తనకు ఫోన్ చేయాలని.. తను చెబితేనే చేయాలని నెట్టెం నిర్దేశిస్తున్నారు. అంతేకాదు.. అధికారుల పర్యటనలు సహా.. సీఎం పర్యటనల వివరాలను కూడా ఆయనకే చెప్పాలని ఆదేశి స్తున్నారు. వాస్తవానికి ఇలాంటి వాటికి ముందుగా ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలి. ఇస్తారు కూడా.
కానీ, జగ్గయ్యపేటలో రెండో ప్రాధాన్యంలో ఎమ్మెల్యే ఉండడం గమనార్హం. గత ఆరు మాసాలుగా ఈ తరహా పరిస్థితి పెరిగిపోయిం దని స్థానికులే చెబుతున్నారు. ఎక్కడ పర్యటించినా.. నెట్టెం కనిపిస్తారు. ఆయన తర్వాత.. మరో నేత.. కనిపిస్తారు. మూడో వ్యక్తిగా ఎమ్మెల్యే రాజగోపాల్ ఉంటున్నారు. ఇక, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆయనకు ఇదే ప్రాధాన్యం లభిస్తోంది. ప్రొటోకాల్ ప్రకారం.. ముందుగా ఆహ్వానం అందుకోవాల్సిన రాజగోపాల్.. ద్వితీయ ప్రాధాన్యానికి పడిపోయారని ఆయన అనుచరులు గగ్గోలు పెడుతున్నారు. అయితే.. ఇవేవీ అధిష్టానానికి ఇంకా చేరలేదని సమాచారం. గొడవలు పెట్టుకునే తత్వం లేకపోవడం.. సౌమ్యంగా ఉండడం అలవాటైన రాజగోపాల్.. ఏం జరిగినా మంచిదే అన్నట్టుగా వారితో కలిసి ముందుకు సాగుతున్నారు.