Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలి.. స్పీకర్ అయ్యన్న మళ్లీ అదే మాట!

స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి ఎమ్మెల్యేల గైర్హాజరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకునే ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

By:  Tupaki Political Desk   |   17 Feb 2026 4:06 PM IST
ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలి.. స్పీకర్ అయ్యన్న మళ్లీ అదే మాట!
X

స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి ఎమ్మెల్యేల గైర్హాజరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకునే ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా అటువంటి వారిని రీకాల్ చేయాలంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కాసేపు సాంకేతిక సమస్య రావడంతో లాబీల్లో మీడియాతో స్పీకర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరును పరోక్షంగా ప్రస్తావిస్తూ స్పీకర్ విమర్శలు చేశారు. గత బడ్జెట్ సమావేశాల నుంచి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా, ఏ సమావేశమైనా సరే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారనే అంశాన్ని హైలెట్ చేస్తున్నారు.

అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలను రీకాల్ చేసే పద్ధతి ఉండాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు బలంగా కోరుకుంటున్నారు. ఆయన ప్రతిపాదనలో రాజకీయమే ఎక్కువగా ఉన్నప్పటికీ పదేపదే ఆయన చేస్తున్న వాదనపై విస్తృత చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో ఏఐ అటెండెన్స్ ప్రవేశపెట్టిన తర్వాత సభ్యుల హాజరు బాగుందని స్పీకర్ వెల్లడించారు. సభ్యులు సభలో ఎంత సేపు ఉన్నది? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వెళుతుందీ స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇదే సమయంలో విపక్ష ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ పరోక్ష విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా సభకు రాని ఎమ్మెల్యేలను రీకాల్ చేసే చట్టం ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘‘శాసనసభకు హాజరు కావడం ఎమ్మెల్యేల విధి. సభకు రాకుండా జీతాలు తీసుకోవడం తగదు. వారి జీతం కట్ చేయాలి.’’ అంటూ వైసీపీ సభ్యులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు స్పీకర్. ఉద్యోగులు విధులకు హాజరుకాకపోతే జీతాలు కట్ చేసే నిబంధనలు ఉన్నప్పుడు, ఆ నిబంధనలు ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించకూడదని స్పీకర్ ప్రశ్నించారు. ప్రపంచంలోని 8 దేశాల్లో చట్టసభ సభ్యులను రీకాల్ చేసే పద్ధతి ఉందని, మన దేశంలో అలాంటి వ్యవస్థ లేదని విచారం వ్యక్తం చేశారు.

తరచూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేస్తున్న ఈ తరహా వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ఆయన ఎక్కడకు వెళ్లినా? వేదిక ఏదైనా ఇదే అంశాన్ని చర్చిస్తున్నారు. గత నెలలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన స్పీకర్ల సదస్సులో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ‘నో వర్క్.. నో పే’ విధానాన్ని ప్రవేశపెట్టాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తెచ్చారు. గత ఏడాది బడ్జెట్ సమావేశాల నుంచి స్పీకర్ ఇదే విధంగా మాట్లాడుతున్నారని గుర్తు చేస్తున్నారు. మన దేశ చట్టాల ప్రకారం ఎమ్మెల్యే హాజరు, జీతాల కోతపై సరైన నిబంధనలు లేవని తెలిసినా, ఆయన పదే పదే అవే వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే విపక్ష వైసీపీని ఇరుకన పెట్టడం, నైతికంగా ఇబ్బంది పెట్టడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని అంటున్నారు.