Begin typing your search above and press return to search.

కేటీఆర్ ని గట్టిగా తగులుకున్న సోమిరెడ్డి... యతిప్రాసలతో నిప్పులు!

వైఎస్ షర్మిళను పావుగా వాడుకున్నారు తప్ప అంతకంటే ఏమీ లేదని చెప్పారు.

By:  Tupaki Desk   |   10 July 2024 12:55 PM GMT
కేటీఆర్  ని గట్టిగా తగులుకున్న సోమిరెడ్డి... యతిప్రాసలతో  నిప్పులు!
X

మంగళవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ ఏపీలో వైసీపీ ఓటమి, ఫలితాలు మొదలైన అంశాలపై బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో రకంగా వచ్చి ఉండేవని అన్నారు. వైఎస్ షర్మిళను పావుగా వాడుకున్నారు తప్ప అంతకంటే ఏమీ లేదని చెప్పారు.

ఇదే సమయంలో అసలు ఏపీలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా వైఎస్ జగన్ ఓడిపోవడం తనకు ఆశ్చర్యంగా ఉందని.. అయినప్పటికీ 40% ఓట్లు రావడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో... ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓడిపోవడంపైనా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో... టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

అవును... ఏపీలో ఎన్నికల ఫలితాలపై బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి "ఎక్స్" వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా... కేసీఆర్, కేటీఆర్, కవితలపై యతిప్రాసలతో విమర్శలు సంధించారు.. తెలంగాణలో బీఆరెస్స్ ఘోర పరాజయానికి గల కారణాన్ని విశ్లేషించారు.

ఇందులో భాగంగా... "బీఆరెస్స్ పాలనలో తండ్రి ఫామ్ హౌస్ కు, కొడుకు కలెక్షన్ హౌస్ కు పరిమితమయ్యారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది" అంటూ కామెంట్ చేశారు.

ఇదే సమయంలో... "ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేS నాశనమైపోవాలని కోరుకున్నారు.. జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో ఐదేళ్లు నలిగిపోవాలని ఆశించారు. అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారు" అని తన ట్వీట్ లో పేర్కొన్నారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సమయంలో “కేటీఆర్ ట్వీట్” ని ప్రస్థావించారు.

ఇందులో భాగంగా... "మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో జైలుకు పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందని గుర్తుంచుకోండి" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరి కేటీఆర్ నుంచి ఈ ట్వీట్ కి రిప్లై వస్తుందా లేదా అనేది వేచి చూడాలి!