'జగన్.. ఆ విషయం నిరూపించకపోతే.. లెంపలేసుకో!'
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు టీడీపీకి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ సవాల్ రువ్వారు.
By: Tupaki Desk | 24 May 2025 8:30 AM ISTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు టీడీపీకి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ సవాల్ రువ్వారు. గురువారం మీడియాతో మాట్లాడిన జగన్.. విశాఖపట్నంలో కొన్ని సంస్థలకు రూపాయికే ఎకరా భూమిని చంద్రబాబు ఇచ్చేస్తున్నారని.. ఇది ప్రజల సొమ్మును దోచిపెట్టడం కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యంగా `ఉర్సా` అనే కంపెనీపై ఆది నుంచి వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా జగన్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉర్సా అనే కంపెనీకి ఎకరా భూమిని రూ.1 కే లీజుకు ఇస్తున్నారని విమర్శించారు.
వాస్తవానికి టాటా కన్సల్టెన్సీ-టీసీఎస్‌కు మాత్రమే ప్రభుత్వం రూపాయికి ఎకరా చొప్పున భూమిని కేటాయిస్తోంది. మిగిలిన వాటికి.. ఇంతని చొప్పున లెక్కగట్టి లీజుకు ఇస్తోంది. ఈ క్రమంలోనూ అనేక నిబంధనలు కూడా పెడుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఇవ్వాలని తేల్చి చెబుతోంది. ఇలానే ఉర్సా కంపెనీకి కూడా.. ఎకరాను రూ.లక్ష చొప్పున ప్రభుత్వం లీజుకు ఇస్తోంది. అయితే.. ఈ విషయాన్ని రాజకీయంగా మార్చుకున్న వైసీపీ అధినేత జగన్.. తాజాగా ఉర్సాకు కూడా ఉచితంగానే రూ.1కే భూములు ఇస్తున్నారని విమర్శించారు.
తాజాగా ఈ విషయంపై సోమిరెడ్డి స్పందిస్తూ.. ఉర్సాకు రూ.1 కే ఎకరా భూమిని లీజుకు ఇచ్చినట్టు నిరూపిస్తే.. సర్వేపల్లి నియో జకవర్గం ఎమ్మెల్యేగా తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ``జగన్.. ఉర్సా సంస్థకు భూములను రూపాయికే లీజుకు ఇస్తున్నామని నువ్వు చెబుతున్నావ్. రా.. దానిని నిరూపించు. ఇది నిజమైతే, నేను నా ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేస్తా. లేకపోతే.. నువ్వు చెప్పిన మాటలు తప్పని మీడియా ముందు ఒప్పుకో. ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పనని లెంపలు వాయించు కో`` అని సోమిరెడ్డి సవాల్ రువ్వారు.
అంతేకాదు.. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకో్ణం దేశంలోనే అతి పెద్దదని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ పాలకులను కేవలం 300 కోట్ల లిక్కర్ అవినీతికే అరెస్టు చేశారని.. కానీ, ఏపీలో మాత్రం 3 వేల కోట్లకు పైగానే సొ్మ్ములు తిన్నారని వ్యాఖ్యా నించారు. తాజాగా శుక్రవారం సర్వేపల్లి నియోజకవర్గంలో మినీ మహానాడును నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యల తో పాటు.. రాజకీయ వ్యవహారాలను కూడా చర్చించారు. ఈ సమయంలోనే జగన్ చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మరి సోమిరెడ్డి చేసిన సవాల్‌పై జగన్ కానీ, ఆయన మనుషులు కానీ స్పందిస్తారో లేదో చూడాలి.
