Begin typing your search above and press return to search.

ఓటరు జాబితా నుంచి స్మృతి ఇరానీ పేరు గల్లంతు..? కేంద్ర మాజీ మంత్రికి షాక్

బీజేపీ ఫైర్ బ్రాండ్, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని అమేథి పంచాయతీ ఓటర్ల జాబితా నుంచి స్మృతి ఇరానీ పేరు తొలగించింది.

By:  Tupaki Desk   |   13 Jun 2026 1:59 PM IST
ఓటరు జాబితా నుంచి స్మృతి ఇరానీ పేరు గల్లంతు..? కేంద్ర మాజీ మంత్రికి షాక్
X

బీజేపీ ఫైర్ బ్రాండ్, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని అమేథి పంచాయతీ ఓటర్ల జాబితా నుంచి స్మృతి ఇరానీ పేరు తొలగించింది. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో ఓటు వేసిన ఆమె.. తాజాగా పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంపై కంగుతిన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అసలు ఏం జరిగిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశమైంది.

అమెథీ జిల్లాలోని స్థానిక పంచాయతీ ఓటర్ల జాబితాలో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేరు కనిపించకపోవడం సంచలనంగా మారింది. ఈ నెల 10న యూపీ ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసిన తుది పంచాయతీ ఓటర్ల జాబితాలో ఈ లోపం వెలుగుచూసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉన్నప్పటికీ, స్థానిక గ్రామ పంచాయతీ లిస్టులో పేరు లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గౌరీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 'మేదన్ మవాయ్' గ్రామ పంచాయతీ పరిధిలో స్మృతి ఇరానీకి సొంత నివాసం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆమె ఇక్కడ శాశ్వత గృహాన్ని నిర్మించుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఇదే గ్రామంలోని 'లీలా తిక్రా' పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అయితే తాజాగా విడుదలైన పంచాయతీ ఓటర్ల జాబితాలో ఆమె పేరు లేకపోవడం కలకలం రేపింది. ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోడానికి అమేథీ జిల్లా కలెక్టర్ సంజయ్ చౌహాన్ తక్షణ విచారణకు ఆదేశించారు.

అసలు కారణం ఇదే!

ఈ వివాదంపై గౌరీగంజ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రీతి తివారీ స్పష్టతనిచ్చారు. ఇది అధికారుల పొరపాటు వల్ల గానీ, రాజకీయ కారణాల వల్ల గానీ జరిగింది కాదని, కేవలం సాంకేతిక నియమాల వల్ల జరిగిందని తెలిపారు. లోక్‌సభ, విధానసభ ఓటర్ల జాబితా వేర్వేరుగా ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించే గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా వేరుగా ఉండటం వల్ల లోపం తలెత్తినట్లు అనుమానిస్తున్నారు. గత పంచాయతీ ఎన్నికల (2021) సమయానికి స్మృతి ఇరానీ ఈ గ్రామంలో ఓటరుగా లేకపోవడం వల్లే ఆమె ఓటు చేర్చలేదని అంటున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మాత్రమే స్మృతి ఇరానీ ఇక్కడ సాధారణ ఓటరుగా నమోదయ్యారని చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం పాత లిస్టులో పేరు లేనప్పుడు, కొత్తగా పేరు చేర్చడానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ తాజా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సమయంలో ఆమె తరఫున పంచాయతీ లిస్టు కోసం ఎలాంటి దరఖాస్తు అందలేదని చెబుతున్నారు. లిస్టులో పేరు లేనప్పుడు, పేరు తొలగించారనే ప్రశ్నే రాదని ఎస్డీఎం స్పష్టం చేశారు. కేవలం కొత్తగా పేరు చేర్చడానికి దరఖాస్తు చేసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తేల్చిచెప్పారు.

ఈ విషయం వివాదాస్పదంగా మారడంతో, మేదన్ మవాయ్ గ్రామ మహిళా ప్రధాన్ 'బబితా మిశ్రా' స్పందించారు. స్మృతి ఇరానీ గ్రామంలోనే శాశ్వతంగా నివసిస్తున్నారని, ఆమె పేరు ఇప్పటికే అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఉన్నందున పంచాయతీ లిస్టులో కూడా చేర్చాలని కోరుతూ గౌరీగంజ్ నియోజకవర్గ ఎన్నికల అధికారికి లేఖ రాశారు. కాగా, బిజెపి అమేథీ జిల్లా అధ్యక్షుడు సుధాంశు శుక్లా కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. స్మృతి ఇరానీ పేరును పంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చడానికి అవసరమైన అధికారిక దరఖాస్తును సమర్పించామని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, తగిన పరిశీలన అనంతరం త్వరలోనే ఆమె పేరును జాబితాలో చేర్చుతామని అధికారులు హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.