సింహాచలం ట్రాజెడీ.. పాలన మీద పట్టు మిస్ ఏంటి చంద్రబాబు?
మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. పాలన విషయంలోనూ.. అధికారుల చేత పనులు చేయించే విషయంలో చంద్రబాబుకు ఉన్న సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెబుతారు.
By: Tupaki Desk | 1 May 2025 9:33 AM ISTమిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. పాలన విషయంలోనూ.. అధికారుల చేత పనులు చేయించే విషయంలో చంద్రబాబుకు ఉన్న సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెబుతారు. అలాంటి చంద్రబాబుకు తాజాగా సర్కారు నడిపే విషయంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారా? ప్రభుత్వం కొలువు తీరి ఏడాది దగ్గరకు వస్తున్న వేళలో.. కీలక సమయాల్లో పాలనాపరమైన పొరపాట్లు కొట్టొచ్చినట్లుగా కనిపించటేమే కాదు..ఈ వైఫల్యాల కారణంగా ప్రజలకు ఎదురవుతున్న కష్టాలు ఇప్పడు కొత్త చర్చకు అవకాశాన్ని ఇస్తున్నాయి.
సింహాచలం గోడ కూలి ఏడుగురు మరణించిన ఉదంతం లోతుల్లోకి వెళ్లితే.. విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏపీలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి సింహాచలం. తిరుమల తిరుపతి శ్రీవారికి బ్రహోత్సవాలు ఎంత ముఖ్యమో.. సింహాచలేశుడికి ఏటా నిర్వహించే చందనోత్సవం ఎంతటి భారీ కార్యక్రమమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది ఒక్క రోజున సింహాచల చందనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏడాదిలో ఈ ఒక్క రోజున స్వామివారి నిజరూపాన్ని చూసే అవకాశం లభిస్తుంది. ఈ కారణంగా.. వేలాది మంది భక్తులు పోటెత్తుతారు.
ఇంతటి పెద్ద ఉత్సవం వేళ.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. వేలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇక్కట్లు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. షాకింగ్ అంశం ఏమంటే.. ఇంతటి పెద్ద కార్యక్రమం జరుగుతున్న వేళ.. ఆలయానికి పెద్ద తలకాయ లాంటి ఈవో సెలవు మీద అమెరికాకు వెళ్లి ఉండటం చర్చనీయాంశంగా మారింది.
ఇంతటి క్రియాశీలక కార్యక్రమాన్ని అవగాహన లేని అధికారికి ఈవోగా అదనపు బాధ్యతలు ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. సీనియర్ మహిళా అధికారిణికి ముఖ్య ఉత్సవ అధికారిగా నియమించారు. ఆమె సైతం చేతులెత్తేసి తప్పుకున్నారు. మరో అధికారికి బాధ్యతలు అప్పగిస్తే.. ఆయన కూడా అంతే. ఇలా ఎవరికి వారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన దానికి ఫలితంగా ఏడుగురి భక్తుల ప్రాణాలు పోయేలా చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేవాదాయ శాఖ ఇంత దారుణంగా ఫెయిల్ కావటం ఏమిటి? అన్నది ఒక ప్రశ్న అయితే.. కీలకమైన దేవాదాయ శాఖలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చంద్రబాబు ఫోకస్ చేయటం ఎలా మిస్ అవుతారని ప్రశ్నిస్తున్నారు.గత ప్రభుత్వ పాలన పుణ్యమా అని వ్యవస్థలన్ని దారుణంగా దెబ్బ తిన్నాయని.. పనులు చేయటమే మానేశాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. యుద్ధ ప్రాతిపదికన అన్ని శాఖల్ని రివ్యూ చేయటం.. అక్కడి లోపాల్ని సరిదిద్దే కార్యక్రమాన్ని జెట్ స్పీడ్ తో చేయాల్సి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
గత ఏడాది జరిగిన చందనోత్సవం సందర్భంగా ఏర్పాట్లు ఏ మాత్రం బాగోలేవన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి వేళ.. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పని తీరు సరిగా లేని కీలక అధికారుల్ని వెంటనే ఎందుకు మార్చలేదు? అన్నది మరో ప్రశ్న. గత ఏడాది సింహాచలం ఈవోగా వ్యవహరించి.. కీలకమైన చందనోత్సవ కార్యక్రమాన్ని డిజాస్టర్ చేసిన ఈవో త్రినాథరావును కంటిన్యూ చేయటం.. ఆయన బాధ్యత లేకుండా ఈ విశేష కార్యక్రమాన్ని వదిలేసి విదేశాలకు ఎలా వెళతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.ఇలాంటి వైఫల్యాలు చంద్రబాబు ప్రభుత్వానికి శాపంగా మారుతున్నాయని చెప్పక తప్పదు. ఈ తీరును ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మార్చాల్సిన బాధ్యత చంద్రబాబుదే. ఈ విషయంలో జరిగే పొరపాట్లకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
