రాజుగారి దయ లేనిదే ఆ టీడీపీ నేతలకు పదవులు రావా..?
దేవుడు తలుచుకున్నా.. పంతులుగారు తలుచుకోకపోతే పుణ్యం దక్కదన్న సామెత టీడీపీలో వినిపిస్తోంది.
By: Tupaki Desk | 27 Feb 2026 8:45 AM ISTదేవుడు తలుచుకున్నా.. పంతులుగారు తలుచుకోకపోతే పుణ్యం దక్కదన్న సామెత టీడీపీలో వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ కోసం టికెట్లు త్యాగం చేసిన నేతలు.. నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో చాలా మందికి చంద్రబాబు పదవులు ఇచ్చారు. అయితే.. విశాఖపట్నంలో నాయకులకు మాత్రం ఇంకా కొందరికి పదవులు దక్కలేదు. అయితే.. చంద్రబాబు ఇవ్వలేదా? అంటే.. ఇచ్చారు. కానీ, ఆయన ఇస్తామన్న పదవులు కాదని కొందరు ప్రత్యేక పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.
అదే.. ప్రఖ్యాత నృసింహ ఆలయం.. సింహాద్రి అప్పన్న ఆలయ ట్రస్టు బోర్డు పదవులు. రాష్ట్రంలోని పలు ప్రఖ్యాత దేవాలయాలకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. గత ఏడాది బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిలో చాలా మందికి పదవులు ఇచ్చారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయ బోర్డు,విజయవాడ దుర్గమ్మ ఆలయం, శ్రీశైలం మల్లన్న ఆలయం, చిత్తూరులోని ప్రముఖ కాణిపాకం వినాయక స్వామి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయ బోర్డులకు కమిటీలను నియమించారు.
కానీ.. ఎటొచ్చీ.. అటు విజయనగరంలోని రామతీర్థం, ఇటు విశాఖలోని సింహాద్రి అప్పన్న ఆలయాలకు బోర్డులను నియమించలేదు. ఈ రెండు కూడా.. అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోకగజపతిరాజు నిర్వహణలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన గోవా రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఆయన గవర్నర్‌గా ఉన్నప్పటికీ.. ఇప్పటికీ.. విజయనగరంలోని పైడితల్లి ఆలయానికి.. అటు రామతీర్థంలోని రాములోరి ఆలయానికి, ఇటు సింహాద్రి అప్పన్న ఆలయానికి కూడా అనువంశిక ధర్మ కర్త హోదాలోనే కొనసాగుతున్నారు.
దీంతో ఈ ఆలయాలకు బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. అటు వైపు నుంచి గవ ర్నర్ అశోక్ గజపతి రాజు నుంచి అనుమతి లభించలేదని ప్రచారం జరుగుతోంది. వీటిలో సింహాద్రి అప్పన్న ఆలయం ప్రఖ్యాతి చెందిందన్న విషయం తెలిసిందే. ఇటు సీమలో తిరుపతికి ఎంత ప్రాధాన్యం ఉందో అటు ఉత్తరాంధ్రలో అప్పన్న ఆలయానికి అంతే ప్రాధాన్యం ఉంది. దీంతో ఈ ఆలయ బోర్డులో చేరేందుకు నాయకులు ఎదురు చూస్తున్నారు.
కానీ, రాజుగారి దయ మాత్రం ఇంకా సాకారం కాలేదు. ఇటీవల విజయనగరంలోని మాన్సాస్ విద్యాసంస్థలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ఒకరిద్దరు నాయకులు రాజుగారికి ఈ విషయాన్ని చేరవేశారు. దీనిపై ఆయన చూద్దాం.. అంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. ఆయన అనుమతి ఎప్పుడు ఇస్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదీ.. సంగతి.
