అల్లుడు లేని అత్త ఆయుష్షువంతురాలా... తెరపైకి షాకింగ్ ఘటనలు!
అత్త లేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు అనేది తెలుగులో చాలా ప్రసిద్ధి చెందిన సామెత.
By: Tupaki Desk | 10 Feb 2026 3:00 PM ISTఅత్త లేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు అనేది తెలుగులో చాలా ప్రసిద్ధి చెందిన సామెత. అత్తాకోడళ్ల మధ్య చోటు చేసుకునే నిరంతర అపార్ధాలు, ఘర్షణలు లేకుండా ఒకరికొకరు దూరంగా ఉంటేనే మంచిదన్నట్లుగా ఈ సామెతను ఉదహరిస్తుంటారు! అయితే... తాజా పరిణామాల నేపథ్యంలో... అల్లుడు లేని అత్త ఆయుష్షువంతురాలు, అదృష్టవంతురాలు అనే చర్చా తెరపైకి వచ్చింది. అందుకు కారణం.. సుమారు గత ఆరు నెలల్లో అత్తలపై అల్లుళ్లు చేసిన నేరాలు - ఘోరాలు!
అవును... గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలోని రోహిణిలో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో బహుమతుల వివాదం కారణంగా తన భార్యతో పాటు 63 ఏళ్ల అత్తను హత్య చేశాడు ఓ అల్లుడు! అదే నెలలో కర్ణాటకలోని కొరటగెరె శివార్లలోని చింపుగనహల్లిలో తన అత్తను చంపి, మృతదేహాన్ని ముక్కలు చేశాడు డెంటిస్ట్ అయిన ఆమె అల్లుడు! అంతకంటే ముందు గత ఏడాది జూలైలో.. తనకు తన భార్యకు మధ్య గొడవలు కారణమవుతుందనే కారణంతో సిద్ధిపేటలో తన అత్తను వేట కొడవల్లతో నరికి చంపాడు మరో అల్లుడు!
ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా.. ఓ ఘటనలో అత్తగారికి అల్లుడు కరెంట్ షాకిస్తే.. మరో ఘటనలో తన అత్తగారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు మరో అల్లుడు. ఈ నేపథ్యంలోనే అల్లుడు లేని అత్త అదృష్టవంతురాలు అని ఒకరంటే.. అల్లుడు లేని అత్త ఆయుష్షువంతురాలు అని మరొకరంటున్న పరిస్థితి!
వివరాళ్లోకి వెళ్తే... నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలానికి చెందిన ఓ మహిళ కు ఇద్దరు కుమార్తెలు కాగా.. వారిలో పెద్ద కుమార్తెను తిమ్మాజీపేట మండలానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే.. అతడు తాగుడుకు బానిసై భార్యను వేధిస్తుండటంతో.. అల్లుడు - కుమార్తెను ఇల్లరికానికి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో.. ఇటీవల మళ్లీ గొడవ జరగడంతో భార్య.. బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయలో అల్లుడు.. తన అత్తపై కన్నేశాడు.
ఈ క్రమంలో ఆమెపై అత్యాచారం చేసి, అనంతరం కొట్టి చంపాడు! అయితే.. సోమవారం చుట్టుపక్కల వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో. రంగంలోకి దిగిన పోలీసులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఇదే సమయంలో.. నిందితుడైన ఆ ఇంటికి పెద్ద అల్లుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక మరో ఘటనలో అత్తకు కరెంట్ షాకిచ్చి చంపాడు అల్లుడు. ఇందులో భాగంగా... మహబూబాబాద్ లోని ఓ ఇంటి అల్లుడు రాజేష్ సోదరుడు రమేష్ కు అంజలి అనే మహిళతో రెండో వివాహం జరిగింది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి వరకూ మద్యం తాగిన రాజేష్... తన సోదరుడి రెండో పెళ్లిపై కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం.. నిద్రపోతున్న అత్త (48) మెడకు విద్యుత్ వైర్లు చుట్టి, షాకిచ్చి హతమార్చాడు. అనంతరం.. మరదలు అంజలిపైనా కత్తితో దాడి చేశాడు!
