Begin typing your search above and press return to search.

వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు... కేసు నమోదు!

ఈ సందర్భంగా వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్థావిస్తూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   7 May 2024 9:50 AM GMT
వైఎస్  షర్మిళ  సంచలన వ్యాఖ్యలు... కేసు నమోదు!
X

ఏపీలో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ రాజకీయం తీవ్రంగా వేడెక్కిపోతుంది. ప్రధానంగా విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తిపోతుంది. ఈ సమయంలో తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి షర్మిళ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్థావిస్తూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... కడప లోక్‌ సభ స్థానంలో నుంచి బరిలోకి దిగుతున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల... వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇందులో భాగంగా... సీబీఐ ఛార్జిషీట్‌ లో తమ తండ్రి పేరును కాంగ్రెస్‌ పార్టీనే చేర్చిందని అప్పట్లో తాను అన్న మాట నిజమే అని చెప్పిన షర్మిళ.. అప్పట్లో తమకు వాస్తవం తెలీదని చెప్పుకొచ్చారు! ఇదే సమయంలో... వివేకా హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందనీ ఎన్నికల ముందు చెప్పి, సీబీఐ విచారణ కూడా కోరిన జగన్... అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ అక్కర్లేదన్నారని విమర్శించారు.

ఇదే క్రమంలో... వైఎస్ వివేకా కడప జిల్లా ప్రజలకు సుమారు 40 ఏళ్లు సేవ చేశారని చెప్పిన షర్మిళ... ఆయన్ను హత్య చేసి ఐదేళ్లయినా ఇప్పటికీ న్యాయం జరగలేదని అన్నారు. ఒకపక్క సీబీఐ ఆధారాలు, సాక్ష్యాలు బయటపెట్టిన తర్వాత కూడా జగన్‌ కు నిజాన్ని అంగీకరించే ధైర్యం లేదని.. సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్‌ రెడ్డిని.. ఆయనకున్న కారణాల వల్ల జగన్‌ కాపాడుకుంటూ వస్తున్నారని అన్నారు!

ఇదే సమయంలో అవినాష్‌ రెడ్డికి కడప ఎంపీ టికెటివ్వకపోతే.. తాను అక్కడ నుంచి పోటీ చేసేదాన్నే కాదని.. ప్రపంచంలో ఇంకెవరూ లేరన్నట్టుగా, వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్‌ రెడ్డిని తీసుకొచ్చి కడపలో నిలబెట్టడం జగన్ అహంకారమని తెలిపారు. ఈ సందర్భంగా... వైఎస్ వివేకా హత్యపై ప్రజాకోర్టులోనైనా తీర్పు రావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అదేవిధంగా... ప్రజల కోసం వివేకాలా తపించే మంచి మనిషి ఈ రోజుల్లో భూతద్దంతో వెతికినా కనిపించరని చెప్పిన షర్మిళ... అలాంటి మనిషిని పొగిడేందుకు జగన్‌ కు ఈ ఐదేళ్లలో ఒక్క మంచి మాటా దొరకలేదని.. కానీ, నామినేషన్ రోజు అంతమందితో సభ పెట్టి.. వివేకా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేందుకు మాత్రం మనసొచ్చిందని ఫైర్ అయ్యారు. అంతే తప్ప ఆయనకు జరిగిన అన్యాయం గురించి మాత్రం ఒక్క మాటా మాట్లాడలేదని విమర్శించారు!

వైఎస్ షర్మిలపై కేసు నమోదు!:

ఆ సంగతి అలా ఉంటే... ష‌ర్మిలపై బ‌ద్వేల్ పోలీస్‌ స్టేష‌న్‌ లో కేసు న‌మోదైంది. ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా... మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసు గురించి మాట్లాడొద్దంటూ క‌డ‌ప కోర్టు ఆదేశించినా.. ఆ కోర్టు ఆదేశాలను ఆమె పెడ‌చెవిన పెట్టి ప్రచారంలో వివేకా కేసుపై మాట్లాడినందుకు బ‌ద్వేల్ పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేశారు!

కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున క‌డ‌ప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ష‌ర్మిల.. ప‌దేప‌దే వివేకా హ‌త్య కేసు గురించి ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. వివేకా హ‌త్య కేసులో నిందితుడైన వైఎస్ అవినాష్‌ రెడ్డికి జ‌గ‌న్ టికెటిచ్చారని ఆమె విమ‌ర్శిస్తున్నారు. దీనిపై అవినాష్‌ రెడ్డి వ‌ర్గీయులు క‌డ‌ప కోర్టులో పిటిష‌న్ వేశారు. ఆ పిటిషన్ పై విచారించిన కోర్టు ఎన్నిక‌ల వేళ ఏ రాజ‌కీయ పార్టీగానీ, అభ్యర్థులు గానీ వివేకా హత్య కేసు గురించి మాట్లాడొద్దంటూ గ‌త నెల‌లో ఆదేశాలిచ్చింది.

అయినప్పటికీ ఆ ఆదేశాల‌ను తుంగ‌లో తొక్కుతూ ష‌ర్మిల వివేకా మ‌ర‌ణ‌మే ప్రధానాస్త్రంగా ప్రచారం చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి! ఈ నేపథ్యంలో... బ‌ద్వేల్‌ పోలీసులు తాజాగా ఆమెపై కేసు న‌మోదు చేశారు. ఈ నేప‌థ్యంలో కోర్టు ష‌ర్మిల‌పై ఎటువంటి చ‌ర్యలు తీసుకుంటుందనేది చ‌ర్చనీయాంశంగా మారింది.