Begin typing your search above and press return to search.

‘సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్’.. చంద్రబాబు సర్కారుకు ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నలు

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభ్యంతరం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   16 Aug 2025 11:29 PM IST
‘సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్’.. చంద్రబాబు సర్కారుకు ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నలు
X

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ తన అధికారిక ఎక్స్ అకౌంటులో శనివారం షర్మిల ట్వీట్ చేశారు. ఆగస్టు 15 వేడుకలు సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలో స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఐదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ కార్యక్రమం పురస్కరించుకుని విజయవాడ బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎన్నికల హామీ సంపూర్ణంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయినట్లు ప్రకటించారు. అయితే సీఎం ప్రకటనపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీల్లో మిగిలిన వాటి సంగతేంటి? అంటూ నిలదీస్తున్నాయి.

షర్మిల ప్రశ్నలు

సీఎం చంద్రబాబు ప్రకటనపై వైసీపీ అనేక ప్రశ్నలు లేవనెత్తగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ట్విటర్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేశారు. ‘‘సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యింది సీఎం చంద్రబాబు గారు’’ అంటూ ప్రశ్నించారు షర్మిల. సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అంటూ విమర్శించారు. ‘‘20 లక్షల ఉద్యోగాల్లో ఒక్కటైనా ఇచ్చారా? నెలకు రూ.3వేల భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందిందా?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని నిలదీశారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని మాట మార్చారంటూ షర్మిల విమర్శించారు.

తల్లికివందనం కోతలు

కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో లింక్ పెట్టి, 30 లక్షల మంది రైతులకు పంగనామాలు పెట్టారని షర్మిల వ్యాఖ్యానించారు. తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు కోత పెట్టారని ఆరోపించారు. రూ.15 వేలు ఇస్తామని రూ.13 వేలతో సరిపెట్టారని ఆక్షేపించారు. దీపం-2లో మూడు సిలిండర్లు ఎంత మందికి అందుతున్నాయో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు షర్మిల. 14 నెలల తర్వాత ఫ్రీ బస్సు అమలు చేసి, సూపర్ సిక్స్ హామీలను ఉద్ధరించామని చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. సూపర్ సిక్స్ ‘‘సూపర్ హిట్ అనడం హాస్యాస్పదం, రాష్ట్ర ప్రజలకు చేసింది ఘరానా మోసం. రాష్ట్రంలో సంక్షేమం సన్నగిల్లింది. అభివృద్ధి అటకెక్కింది. సుపరిపాలన కొండెక్కింది.’’ అంటూ చంద్రబాబుతోపాటు తెలుగుదేశం, జనసేన పార్టీలను ట్యాగ్ చేశారు షర్మిల.

జగన్ ను వెనక్కి నెట్టి

కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీలు ఘనంగా ఉన్నాయని చెప్పిన షర్మిల అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఘనంగా చాటుకుంటున్న సూపర్ సిక్స్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఎదురుదాడి ఆసక్తికరంగా మారింది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీని మించిన స్థాయిలో షర్మిల ప్రశ్నించడం రాజకీయంగా ఆకట్టుకుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. శుక్రవారం స్త్రీశక్తిని ప్రారంభించిన సీఎం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ప్రకటించారు. అయితే సీఎం ప్రకటనపై విపక్ష నేత జగన్ ఇంతవరకు స్పందించలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదని అంటున్నారు. ఒక రోజు ఆలస్యమైనా షర్మిల సమగ్ర వివరాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బాగుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.