కాంగ్రెస్ వదిలేసింది.. షర్మిలే పట్టుకున్నారు.. !
కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఏం చేస్తున్నారు? అంటే.. సైలెంట్‌గా పాదయాత్ర చేస్తున్నారన్న సమాధానం వినిపిస్తోంది.
By: Garuda Media | 16 Feb 2026 4:56 PM ISTకాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఏం చేస్తున్నారు? అంటే.. సైలెంట్‌గా పాదయాత్ర చేస్తున్నారన్న సమాధానం వినిపిస్తోంది. ఆమె ఊసు ఎక్కడా వినిపించడం లేదు. కానీ.. సైలెంట్‌గా మాత్రం ఆమె.. ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఎక్కడా చడీ చప్పుడు కూడా కనిపించడం లేదు. కొన్నాళ్ల కిందట .. వైసీపీ అధినేత జగన్.. పాదయాత్ర చేస్తానని ప్రకటించినప్పుడు.. షర్మిల సెటైర్లు పేల్చారు. ఆ సమయంలో కొంత మీడియా ముందుకు వచ్చారు.
ఆ తర్వాత మళ్లీ తెరచాటు అయిపోయారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి.. దీనికి సంబంధించిన నిబంధనలు కూడా మార్చిన నేపథ్యంలో ఈ విధానాన్ని షర్మిల తప్పుబట్టారు. ముఖ్యంగా మహాత్మాగాంధీ పేరును ఈ పథకంలో తీసేయడంతో పాటు.. రాష్ట్రాల వాటాను పెంచిన నేపథ్యాన్ని కూడా షర్మిల తప్పుబట్టారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
దీంతో దేశంలో పలు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు `బీవీజీ-రాంజీ` పథకాన్ని నిరసిస్తూ.. పెద్ద ఎత్తున ఉద్యమించారు. అయితే.. అప్పట్లో ఏపీలో ఈ కార్యక్రమాన్ని షర్మిల ప్రారంభించలేదు. సొంత పనులపై ఆమె దూరంగా ఉన్నారు. ఇక, పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు బీవీజీ-రాంజీ పథకంపై నిరసనలను వదిలేసి.. భారత సైనిక అధికారి జనరల్ నరవణే రాసిన పుస్తకంపై పెద్ద ఎత్తున ఉద్యమించారు.
సో.. పార్లమెంటు సమావేశాలకు ముందే.. జీరాంజీ పథకంపై నిరసనలను కాంగ్రెస్ వదిలేసింది. కానీ, ఆ తర్వాత.. తీరిగ్గా షర్మిల.. జీరాంజీ నిరసనలను ఏపీలో ప్రారంభించారు. ప్రస్తుతం సీమ జిల్లాల్లో ఆమె ఈ నిరసనలను కొనసాగిస్తున్నారు. తనకు అవకాశం ఉన్న జిల్లాలలో పర్యటిస్తూ.. స్థానికులతో భేటీ అవుతున్నారు. మహాత్మాగాంధీ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానం ఇదీ.. అంటూ ఆమె ప్రచారం చేస్తున్నారు. కొన్ని చోట్ల పాదయాత్ర కూడా చేస్తున్నారు. కానీ, ఆశించిన విధంగా షర్మిలకు ఈ కార్యక్రమం మైలేజీ ఇవ్వలేదు. కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు వదిలేయడం.. ఆ తర్వాత.. ఆమె ఈ నిరసనను అందిపుచ్చుకోవడంతో పెద్దగా ఎక్కడా చర్చలేకుండా పోయింది. ఇదీ.. సంగతి!!.
