Begin typing your search above and press return to search.

ఉలకని పలకని అలీ...క్లారిటీ అపుడేనట...!?

చివరి నిముషంలో ఆయన పార్టీలో చేరడం వల్ల టికెట్ కేటాయించలేక పోయామని అప్పట్లో వైసీపీ వర్గాలు చెప్పాయి.

By:  Tupaki Desk   |   8 April 2024 1:30 AM GMT
ఉలకని పలకని అలీ...క్లారిటీ అపుడేనట...!?
X

సినీ నటుడు సీనియర్ కమెడియన్ అలీ వైసీపీలో కీలకమైన పదవులో ఉన్నారు. ఎలక్ట్రానికి మీడియా అడ్వైజర్ గా అయన 2022 అక్టోబర్ లో నియమితులు అయ్యారు. అలీ 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. చివరి నిముషంలో ఆయన పార్టీలో చేరడం వల్ల టికెట్ కేటాయించలేక పోయామని అప్పట్లో వైసీపీ వర్గాలు చెప్పాయి.

అలీ కూడా అదే మాట అన్నారు. ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేస్తూ వచ్చారు. ఆయనకు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తారని అనుకున్నారు. కానీ వైసీపీ అయిదేళ్ల పాలనలో ఆయన పేరు పలు మార్లు అభ్యర్ధుల జాబితాలో వినిపించినా చివరి నిముషంలో నిరాశే కలిగింది.

ఇక అలీకి 2024 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ కానీ అర్బన్ కానీ ఇస్తారని అనుకున్నారు. అలీ కూడా ఆ సీట్ల మీదనే దృష్టి పెట్టారు. కానీ చివరికి ఆ సీట్లలో అర్బన్ ని ఎంపీ మార్గాని భరత్ కి రూరల్ ని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణకు ఇచ్చేశారు.

దాంతో అలీకి గుంటూరు నుంచి ఎంపీగా కానీ కర్నూల్ ఎంపీగా కానీ ఇస్తారని అనుకున్నారు. తీరా చూస్తే ఆ సీట్లకు ఎంపిక జరిగిపోయింది. మొత్తం 175 ఎమ్మెల్యే 25 ఎంపీ సీట్ల భర్తీలో ఎక్కడా అలీ పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోను అయ్యారని అంటున్నారు.

దాంతో అలీ గప్ చిప్ అయ్యారని అంటున్నారు. ఆయన విపక్షం వైపు అడుగులు వేయలేకపోతున్నారు. అలాగని వైసీపీలో ఉండలేకపోతున్నారు అంటున్నారు. అలీ సినీ పరిశ్రమ నుంచి వైసీపీకి ఉన్న అతి కొద్ది మంది మద్దతుదారులలో ప్రముఖుడు. ఆయన 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆయనకు చాన్స్ దక్కకపోవడంతో నిరాశలో మునిగారు

నిజానికి చూస్తే అలీకి ఈ కోరిక ఈనాటిది కాదు, 2000 ప్రాంతంలో ఆయన టీడీపీలో చేరారు. నాటి నుంచి ఆయన ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి అని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అప్పట్లో చంద్రబాబు అయినా ప్రస్తుతం జగన్ అయినా అలీ కోరికను తీర్చలేకపోయారు.

ఇక మిగిలింది ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులే. రేపటి రోజున వైసీపీ అధికారంలోకి వస్తే ఇస్తామని హామీ ఇవ్వవచ్చు. దానిని విశ్వసించి ఆ పార్టీకి ఆయన ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉంది. అయితే అలీ ఇప్పటిదాకా సందడి చేయడం లేదు. దాంతో ఆయన వైసీపీలో కొనసాగుతారా లేక రాజీనామా సమర్పిస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే అలీ తొందర పడటం లేదు అని అంటున్నారు. ఆయన రెగ్యులర్ పొలిటీషియన్ కాదు కాబట్టి నింపాదిగానే ఆలోచిస్తారు అని అంటున్నారు.

ఇక నోటిఫికేషన్ ఈ నెల 18న ఏపీకి సంబంధించి ఎమ్మెల్యే ఎంపీల కోసం రిలీజ్ కానుంది. ఆ తరువాత ప్రచారం మరింతగా జోరు చేయవచ్చు. దాంతో అలీ అప్పటికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. వైసీపీ నేతలు అయితే ఆయన పార్టీలోనే ఉన్నారు ప్రచారం చేస్తారు అని అంటున్నారు.

అలీ తన నిర్ణయం ఏమిటి అన్నది నామినేషన్ల పర్వం తరువాతనే తెలియజేయవచ్చు అంటున్నారు. మొత్తానికి అలీ ప్రస్తుతానికి అయితే అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు అని అంటున్నారు. చూడాలి మరి అలీ అడుగులు ఏ వైపునకు పడతాయో. ఆయన తీసుకోబోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో.