ఎస్ఏఎస్ గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ 2026: గెలుపు ఎవరిదంటే?
2026 ఏప్రిల్ 29న దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాలు కేరళ, అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మళ్లింది.
By: A.N.Kumar | 29 April 2026 8:22 PM IST2026 ఏప్రిల్ 29న దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాలు కేరళ, అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మళ్లింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన ఎస్ఏఎస్ గ్రూప్ (ఐఐటీయన్స్ గ్రూప్) విడుదల చేసిన విశ్లేషణాత్మక అంచనాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్‌కు చెందిన 'ఎస్ఏఎస్ గ్రూప్' (ఐఐటీయన్స్ బృందం) ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై విడుదల చేసిన అంచనాలు దేశవ్యాప్త చర్చకు తెరలేపాయి. కేరళ నుంచి బెంగాల్ వరకు, అసోం నుంచి తమిళనాడు వరకు ఓటరు నాడిని పట్టుకునే ప్రయత్నంలో ఈ నివేదిక కొన్ని కీలక పరిణామాలను మన ముందు ఉంచింది. ఈ అంచనాలను లోతుగా విశ్లేషిస్తే, భారత రాజకీయాల్లో మారుతున్న ఓటర్ల ప్రాధాన్యతలు, ప్రాంతీయ శక్తుల బలాబలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
1. పశ్చిమ బెంగాల్: మళ్ళీ మమతమ్మే!
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలకు గాను అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది.
టీఎంసీ: 170 - 190 స్థానాలు (46% ఓట్లు)
బీజేపీ: 93 - 100 స్థానాలు (42% ఓట్లు)
గ్రేటర్ కోల్‌కతా ప్రాంతంలో టీఐసీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. మహిళా ఓటర్లు, ముస్లిం ఓటర్లు మమత బెనర్జీ వైపు మొగ్గు చూపడం అవసరం.
2. కేరళ: యూడీఎఫ్ పునరాగమనం?
గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కు ఈసారి ఎదురుగాలి వీస్తున్నట్లు సర్వే చెబుతోంది.
యూడీఎఫ్ (కాంగ్రెస్ కూటమి): 75 - 85 స్థానాలు (41.5% ఓట్లు)
ఎల్డీఎఫ్ (లెఫ్ట్ కూటమి): 52 - 62 స్థానాలు (39.5% ఓట్లు)
బీజేపీ: 3 - 4 స్థానాలు
ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం మరియు సీపీఎం అంతర్గత విభేదాలు యూడీఎఫ్ కు కలిసొచ్చే అంశాలు.
3. తమిళనాడు: స్టాలిన్ మార్క్ పాలిటిక్స్
తమిళనాడులో డీఎంకే తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోనుంది.
డీఎంకే: 153 - 165 స్థానాలు (40-41% ఓట్లు)
అన్నాడీఎంకే : 58 - 66 స్థానాలు (37-38% ఓట్లు)
టీవీకే (విజయ్ పార్టీ): 4 - 8 స్థానాలు (15-16% ఓట్లు)
సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ గుర్తింపు ఓట్లు సాధించేందుకు, సీట్ల రూపంలో అది పెద్దగా ప్రభావం చూపలేకపోవచ్చు. ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోని ఏఐఏడీఎంకే బలహీనపడటం డీఎంకేకు వరంగా మారింది.
4. అస్సాం: బీజేపీ హ్యాట్రిక్?
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో మళ్ళీ బీజేపీ (NDA) జెండా ఎగరవేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎన్డీఏ: 78 - 85 స్థానాలు (46% ఓట్లు)
యూపీఏ : 38 - 45 స్థానాలు
ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ చరిష్మా, అభివృద్ధి పథకాలు బీజేపీకి విజయావకాశాలను పెంచాయి. కాంగ్రెస్‌లో బలమైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అయ్యింది.
5. పుదుచ్చేరి: అధికారం దిశగా..
పుదుచ్చేరిలో సైతం ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది.
ఎన్డీఏ : 16 - 20 స్థానాలు
ఇండియా అలయన్స్: 10 - 13 స్థానాలు
కేరళలో మార్పు కోరుకుంటున్నారా?
కేరళలో ఎల్‌డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ పోరు ఎప్పుడూ హోరాహోరీగానే ఉంటుంది. అయితే వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న ఎల్‌డీఎఫ్‌కు ఈసారి 'ప్రభుత్వ వ్యతిరేకత' పెద్ద సవాలుగా మారినట్లు కనిపిస్తోంది. నిరుద్యోగం, అవినీతి ఆరోపణలు పాలక పక్షానికి ప్రతిబంధకాలుగా మారగా యూడీఎఫ్ మళ్ళీ పుంజుకోవడం గమనార్హం. ఇక్కడ బీజేపీ 15% ఓటు షేర్‌తో తన ఉనికిని చాటుకోవడం.. కేరళలో త్రిముఖ పోటీ దిశగా రాజకీయాలు మారుతున్నాయనడానికి సంకేతం.
బెంగాల్, అసోం.. సంక్షేమం వర్సెస్ సిద్ధాంతం
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై భారం వేయగా బీజేపీ జాతీయవాదం, అభివృద్ధిని నమ్ముకుంది. టీఎంసీకి 46%, బీజేపీకి 42% ఓట్లు వస్తాయన్న అంచనా అక్కడ ప్రజాభిప్రాయం ఎంత చీలిపోయిందో చెబుతోంది. ఇక అసోంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ఎన్‌డీఏ తన స్థానాన్ని పదిలపరుచుకోవడం చూస్తుంటే ప్రజలు స్థిరమైన నాయకత్వానికి.. అభివృద్ధికి పట్టం కడుతున్నట్లు అర్థమవుతోంది.
తమిళనాడు.. కొత్త శకం ఆరంభం?
తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే తన పట్టును నిలుపుకుంటున్నప్పటికీ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే 15-16% ఓట్లు సాధిస్తుందన్న అంచనా అత్యంత కీలకం. దశాబ్దాలుగా సాగుతున్న రెండు ప్రధాన ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి ఇది గట్టి సవాలు కానుంది. యువత, తటస్థ ఓటర్లు కొత్త ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారనేది ఇక్కడ స్పష్టమవుతోంది.
నిర్ణయాత్మక శక్తిగా మహిళలు, యువత
ఎస్ఏఎస్ గ్రూప్ విశ్లేషణలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న మరో అంశం మహిళా ఓటర్ల ప్రభావం. బెంగాల్‌లో టీఎంసీకి, తమిళనాడులో డీఎంకేకు మహిళా సంక్షేమ పథకాలు పెద్ద రక్షణ కవచాలుగా నిలిచాయి. మరోవైపు నిరుద్యోగం అనే అంశం యువతను ఆలోచింపజేస్తోంది. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే కేవలం భావోద్వేగాలు సరిపోవని, ఆర్థిక భరోసా ఇవ్వడం అనివార్యమని ఈ ఎన్నికలు హెచ్చరిస్తున్నాయి.
ఓటరు నాడి ఎటువైపు?
ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత విశ్వసనీయత గల ఎస్ఏఎస్ గ్రూప్ విశ్లేషణ ప్రకారం.. ఈ ఎన్నికల్లో నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, స్థానిక నాయకత్వ పటిమ ప్రధాన పాత్ర పోషించాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం అంచనాలు మాత్రమే. మే 2న వెల్లడయ్యే ఫలితాలు ఈ ఐదు రాష్ట్రాల రాజకీయ గమనాన్ని మార్చనున్నాయి. అప్పటివరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది!
