Begin typing your search above and press return to search.

ఏడాదిలోనే డబుల్ సంపద… ఆ వారసుల రైజ్ షాకింగ్!

టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ (AI) నామస్మరణే వినిపిస్తోంది. ఈ ఏఐ హవా కేవలం కొత్త సాఫ్ట్‌వేర్‌లకే పరిమితం కాకుండా, దిగ్గజ కంపెనీల యజమానుల తలరాతలను కూడా మార్చేస్తోంది.

By:  Madhu Reddy   |   30 April 2026 12:00 AM IST
ఏడాదిలోనే డబుల్ సంపద… ఆ వారసుల రైజ్ షాకింగ్!
X

టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ (AI) నామస్మరణే వినిపిస్తోంది. ఈ ఏఐ హవా కేవలం కొత్త సాఫ్ట్‌వేర్‌లకే పరిమితం కాకుండా, దిగ్గజ కంపెనీల యజమానుల తలరాతలను కూడా మార్చేస్తోంది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ వారసుల సంపద కేవలం ఏడాది కాలంలోనే రెండింతలు పెరగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిప్ తయారీలో శాంసంగ్ చూపుతున్న దూకుడు వల్ల ఆ కుటుంబం ఆసియాలోనే అత్యంత ధనిక కుటుంబాల జాబితాలో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్తోంది.

ఏఐ చిప్స్ తెచ్చిన అదృష్టం:

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి కావాల్సిన సెమీ కండక్టర్ చిప్స్ తయారీలో శాంసంగ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐ చిప్స్ కోసం డిమాండ్ విపరీతంగా పెరగడంతో, గత ఏడాది కాలంలో శాంసంగ్ షేర్ల విలువ ఏకంగా 126 శాతం పెరిగింది. ఈ పెరుగుదల వల్ల శాంసంగ్ వారసులైన 'లీ' కుటుంబం సంపద ఏకంగా 45.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.3.8 లక్షల కోట్లు) చేరింది.

పన్నుల భారం ఈజీగా తీరింది:

సాధారణంగా దక్షిణ కొరియాలో వారసత్వంగా వచ్చే ఆస్తిపై భారీగా పన్నులు ఉంటాయి. శాంసంగ్ వారసులు కూడా దాదాపు 8.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 67 వేల కోట్లు) భారీ వారసత్వ పన్నును చెల్లించాల్సి వచ్చింది. అయితే, కంపెనీ షేర్ల విలువ ఊహించని విధంగా పెరగడంతో, ఈ భారీ పన్ను మొత్తాన్ని వారు చాలా సులువుగా కట్టగలిగారు. ఆస్తి పెరగడమే కాకుండా, అప్పులు తీరడం ఆ కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చింది.

దేశ ఆర్థిక వ్యవస్థలో శాంసంగ్ హవా:

జై వై లీ మళ్ళీ కంపెనీ పగ్గాలు చేపట్టాక శాంసంగ్ ఆదాయం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దక్షిణ కొరియా మొత్తం జిడిపి లో శాంసంగ్ వాటానే 19.3 శాతానికి చేరింది. అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఐదో వంతు కేవలం ఈ ఒక్క కంపెనీ నుంచే వస్తోంది. దీంతో ఆసియాలోనే మూడవ అత్యంత ధనిక కుటుంబంగా లీ ఫ్యామిలీ అవతరించింది.

సెమీకండక్టర్ రంగంలో ఆధిపత్యం:

ఒకప్పుడు కేవలం మొబైల్ ఫోన్లు, టీవీలకే పరిమితమైన శాంసంగ్, ఇప్పుడు సెమీకండక్టర్ రంగంలో రారాజుగా మారుతోంది. భవిష్యత్తు అంతా ఏఐపైనే ఆధారపడి ఉండటంతో, దానికి అవసరమైన చిప్స్ సరఫరా చేస్తూ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. వేల కోట్ల పెట్టుబడులు పెడుతూ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో శాంసంగ్ వారసులు సక్సెస్ అయ్యారు.

మార్పును గమనించి టెక్నాలజీకి అనుగుణంగా అడుగులు వేస్తే సంపద దానంతట అదే వస్తుందని శాంసంగ్ నిరూపించింది. కేవలం ఫోన్లు అమ్మడం కాకుండా, ప్రపంచానికి కావాల్సిన 'బ్రెయిన్' (ఏఐ చిప్స్) తయారు చేయడం వల్లే ఈ స్థాయిలో సంపద పెరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ ఏఐ విప్లవం ఇంకెంతమంది బిలియనీర్ల ఆస్తులను డబుల్ చేస్తుందో చూడాలి!