Begin typing your search above and press return to search.

'అతి విశ్వాసం పనికిరాదు'... చాట్ జీపీటీ సృష్టికర్త షాకింగ్ వ్యాఖ్యలు!

అవును... ప్రస్తుతం కాలంలో 'చాట్‌ జీపీటీ'కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Jun 2025 12:49 AM IST
అతి విశ్వాసం పనికిరాదు... చాట్  జీపీటీ సృష్టికర్త షాకింగ్  వ్యాఖ్యలు!
X

ఓపెన్‌ ఏఐ కొత్తగా నిర్వహిస్తోన్న పాడ్‌ కాస్ట్‌ తొలి ఎపిసోడ్‌ లో చాట్‌ జీపీటీ సృష్టికర్త, ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌ మన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ చాట్‌ బాట్‌ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అది ఇచ్చే సమాచారంపై అతి విశ్వాసం పనికిరాదంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

అవును... ప్రస్తుతం కాలంలో 'చాట్‌ జీపీటీ'కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే సంగతి తెలిసిందే. ప్రపంచంలోని ఏ విషయంపై అయినా, ఎలాంటి ప్రశ్న అడిగినా లేదనకుండా సమాధానం చెబుతుండటంతో.. స్టూడెంట్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకూ ఎంతోమంది వినియోగిస్తున్నారు.. మరికొంతమంది పూర్తిగా ఆధారపడిపోతున్నారు.

అయితే.. ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అది ఇచ్చే సమాచారంపై అతి విశ్వాసం పనికిరాదని, అసలు ఉనికిలోలేని అంశానికి కూడా చక్కగా తప్పుడు సమాచారం ఇస్తుంటాయని స్వయంగా చాట్‌ జీపీటీ సృష్టికర్త అయిన శామ్‌ ఆల్టమన్‌ హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఈ విషయం ఆసక్తికరంగా మారింది.

ఈ సందర్భంగా స్పందించిన ఏఐ ఎలాంటి మాయ అయినా చేస్తుందని.. అందుకే చాట్‌ జీపీటీపై ప్రజలు విపరీతమైన విశ్వాసం చూపిస్తున్నారని చెప్పిన ఆల్ట్ మన్... దీన్ని అంతగా నమ్మకూడదని.. కృత్రిమ మేధ రంగంలో చాట్‌ జీపీటీ వంటి ఏఐ మోడళ్లు యూజర్ల అవసరాలను తీర్చేందుకు కొన్ని సార్లు వాస్తవాలతో రాజీపడి కల్పిత సమాచారాన్ని సృష్టిస్తుంటాయని అన్నారు.

తాను తండ్రిగా మారిన తర్వాత చాట్‌ జీపీటీపై అతిగా ఆధారపడటం మొదలుపెట్టానని చెప్పిన ఆల్ట్ మన్.. వాస్తవిక ప్రపంచంలోనే అసలైన శక్తి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం మనం అత్యంత శక్తిమంతమైన యుగం ప్రారంభంలో ఉన్నామని.. ఈ సమయంలో జాగ్రత్తగా లేకపోతే.. విశ్వసనీయతకు అర్థం లేకుండా పోతుందని స్పష్టం చేశారు.

కాగా... 2022లో ఓపెన్‌ ఏఐ చాట్‌ జీపీటీని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్ల మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ట్ మన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.