"చాట్‌జీపీటీని ఎక్కువగా నమ్మకండి" ఓపెన్‌ఏఐ సీఈఓ సంచలన వ్యాఖ్యలు!
ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి కార్యాలయ పనుల్లో సహాయపడుతున్న చాట్‌జీపీటీపై ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చేసిన తాజా వ్యాఖ్యలు టెక్ ప్రపంచంలో షాక్‌కు గురి చేస్తున్నాయి.
By: Tupaki Desk | 4 July 2025 5:44 AMప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి కార్యాలయ పనుల్లో సహాయపడుతున్న చాట్‌జీపీటీపై ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చేసిన తాజా వ్యాఖ్యలు టెక్ ప్రపంచంలో షాక్‌కు గురి చేస్తున్నాయి. ఓపెన్‌ఏఐ అధికారిక పోడ్‌కాస్ట్ తొలి ఎపిసోడ్‌లో పాల్గొన్న ఆల్ట్‌మన్ “చాట్‌జీపీటీపై ప్రజలు చాలా ఎక్కువ స్థాయిలో నమ్మకం ఉంచుతున్నారు. ఇది ఆసక్తికరమే కానీ, ఏఐ తప్పుడు సమాచారం ఇవ్వగలదు. ఇది మోసం చేసే టెక్నాలజీ కావచ్చు. అంత నమ్మకంగా చూడకూడదు” అని వ్యాఖ్యానించారు.
ఏఐ పరిమితులపై స్పష్టత అవసరం
చాట్‌జీపీటీ తరచూ అభివృద్ధి చెందుతున్నా, ఇంకా చాలా పరిమితులు ఉన్నాయని ఆల్ట్‌మన్ ఒప్పుకున్నారు. ఈ టెక్నాలజీ యొక్క లోపాలను నిజాయితీగా పారదర్శకంగా వెల్లడించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ మధ్యే చాట్‌జీపీటీకి వచ్చి చేరిన కొత్త ఫీచర్లైన పర్సిస్టెంట్ మెమరీ (స్థిరమైన జ్ఞాపకశక్తి) , యాడ్స్-ఆధారిత మోడల్ ప్రకటనలతో కూడిన వాడక పద్ధతి వల్ల కొత్తగా గోప్యతా ఆందోళనలు తలెత్తినట్లు ఆల్ట్‌మన్ గుర్తించారు.
- న్యూయార్క్ టైమ్స్ వంటి మీడియా సంస్థలతో చట్టపరమైన వివాదాలు
ఆల్ట్‌మన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఓపెన్‌ఏఐ సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న చట్టపరమైన సవాళ్ల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు కంటెంట్ వాడకం.. కాపీహక్కుల విషయంలో ఓపెన్‌ఏఐపై కేసులు వేశాయి. ఈ వివాదాలపై కంపెనీ ఇప్పటికే స్పందించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
- ఏఐ హార్డ్‌వేర్‌పై ఆల్ట్‌మన్ “యూ-టర్న్”
ఇక ఏఐ కోసం కొత్త హార్డ్‌వేర్ అవసరం లేదన్న తన మునుపటి వ్యాఖ్యలపై ఆల్ట్‌మన్ ఇప్పుడు వెనకడుగు వేశారు. "ఇప్పుడు మనం వినియోగిస్తున్న కంప్యూటర్లు, ఏఐ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకోకుండా రూపొందించబడ్డాయి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏఐ ప్రధానమైన భాగంగా మారుతోంది కనుక కొత్త పరికరాల అవసరం తప్పదు," అని ఆయన స్పష్టం చేశారు.
ఓపెన్‌ఏఐ సీఈఓ వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్న విషయం ఏమిటంటే చాట్‌జీపీటీ సహాయకంగా ఉండగలదు, కానీ అది పూర్ణంగా నమ్మదగినది కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల వాడకంలో జాగ్రత్త అవసరం. వినియోగదారులు ఈ టూల్స్‌ను సూచనలుగా మాత్రమే భావించాలి గానీ, వాటిని తుది తీర్పుగా తీసుకోకూడదు. ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో మరింత మెరుగవుతుందని ఆశిద్దాం, కానీ ప్రస్తుతానికి దాని పరిమితులను గుర్తించి వివేకంతో ఉపయోగించడం ముఖ్యం.