Begin typing your search above and press return to search.

'సాక్షి'లో చంద్రబాబు ఫుల్ పేజీ యాడ్.. వైసీపీలో కలకలం

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కుటుంబ సంస్థ ‘సాక్షి’ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో సోమవారం ప్రచురించిన ఫుల్ పేజి యాడ్ కలకలం రేపింది.

By:  Tupaki Desk   |   23 March 2026 4:28 PM IST
సాక్షిలో చంద్రబాబు ఫుల్ పేజీ యాడ్.. వైసీపీలో కలకలం
X

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కుటుంబ సంస్థ ‘సాక్షి’ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో సోమవారం ప్రచురించిన ఫుల్ పేజి యాడ్ కలకలం రేపింది. అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేస్తున్న ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఆ యాడ్ ను సాక్షిలో ఎలా ముద్రించారని, దీనికి ఎవరు అనుమతించారని వైసీపీ పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రతిరోజూ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలు, సాక్షి పత్రిక ఆ ప్రకటనను ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. డబ్బుల కోసం ఈ ప్రకటనను అంగీకరించారా? దీనికి అనుమతి ఇచ్చింది ఎవరు? మాజీ సీఎం జగన్మోహనరెడ్డి, సాక్షి చైర్మన్ భారతీ రెడ్డికి తెలిసే ఇలా జరిగిందా? అంటూ వైసీపీ నేతల్లో చర్చ జరుగుతోంది.

ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్ఎస్ ఇండియా) సంస్థ 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పడానికి శంకుస్థాపన చేస్తున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో కేంద్రమంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్టీల్ ప్లాంట్ పనులకు భూమిపూజ చేశారు. రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్షమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని ప్రకటించారు. 5,465 ఎకరాల్లో మొత్తం రెండు దశల్లో ఈ ప్రాజెక్టు సాకారం కానుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేయనుందనేది ఆ ప్రకటన సారాంశం. అయితే సాక్షిలో వచ్చిన ఈ ప్రకటనపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

సాక్షి పత్రిక వ్యాపార కోణంలో ఇలాంటి ప్రకటనలు అనుమతిస్తే, రాజకీయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నష్టం జరుగుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి రోజూ రాష్ట్రంలో అభివృద్ధి లేదని, పరిశ్రమలకు అనుమతిచ్చే పేరుతో భూములు దోచుకుంటున్నారని వైసీపీ నేతలు, సాక్షిలో విమర్శలు, విమర్శనాత్మక కథనాలు ప్రచురిస్తున్నామని, అయితే ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరుగుతోందని చెప్పడం ద్వారా ఏం సంకేతాలు వెళతాయని కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఈ ప్రకటన ద్వారా వచ్చే డబ్బు సాక్షి యాజమాన్యానికి అంత అవసరమైందా? ఇలాంటి ప్రకటనలు వేయకుండా సాక్షిని నడపలేరా? అంటూ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

సాక్షి యాజమాన్యం ఈ ప్రకటనను ఎలా ఆమోదించిందో కానీ, మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని అభిమానించేవారు, సాక్షి పత్రిక పాఠకులు ఇలాంటి వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఇలాంటి ప్రకటన ఇప్పుడే కాదని గతంలో కూడా టీడీపీ రికార్డు స్థాయిలో సభ్యత్వం నమోదు చేసిందని ఫ్రంట్ పేజీలో ప్రకటన వేశారని గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వం, టీడీపీ అగ్ర నాయకత్వం వ్యూహాత్మకంగానే ఇలాంటి ప్రకటనలను సాక్షికి ఇస్తున్నారని, వైసీపీ అనుకూల వర్గాల్లోనూ చర్చకు తెరలేపుతున్నారని అంటున్నారు. సాక్షి రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న భారతిరెడ్డి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కార్యకర్తలు సూచిస్తున్నారు. లేనిపక్షంలో పార్టీ వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లలేని పరిస్థితి చేజేతులా తెచ్చుకోవాల్సివుంటుందని హెచ్చరిస్తున్నారు.