Begin typing your search above and press return to search.

మోసాల క్యూనెట్.. ఇగ్నైట్ పేరుతో రూ.5వేల కోట్ల దోపిడీకి స్కెచ్

దాదాపు పాతికేళ్ల పాటు దేశంలోని లక్షల మందిని ముంచిన ఈ క్యూనెట్ సంస్థ గుట్టు రట్టు చేయటంతో పాటు.. దాని దోపిడీని అడ్డుకట్ట వేసేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా ఉన్న వేళలో సజ్జన్నార్ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

By:  Garuda Media   |   12 Jun 2026 12:20 PM IST
మోసాల క్యూనెట్.. ఇగ్నైట్ పేరుతో రూ.5వేల కోట్ల దోపిడీకి స్కెచ్
X

తియ్యటి మాటలు చెప్పటం.. కళ్ల ముందే కలల ప్రపంచాన్ని క్రియేట్ చేయటం.. కాస్త కష్టపడితే చాలు.. లక్షలాది రూపాయిలు కుప్పలుకుప్పలుగా మీ ఇంటికి వస్తాయని చెబుతూ చీటింగ్ చేసే సంస్థల్లో ఒకటిగా క్యూనెట్ పేరును ప్రస్తావిస్తుంటారు సీనియర్ పోలీసు అధికారి కం హైదరబాద్ పోలీసు కమిషనర్ సజ్జన్నార్. గతంలోనూ ఆయన క్యూనెట్ మోసాల పరంపరకు చెక్ చెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు పాతికేళ్ల పాటు దేశంలోని లక్షల మందిని ముంచిన ఈ క్యూనెట్ సంస్థ గుట్టు రట్టు చేయటంతో పాటు.. దాని దోపిడీని అడ్డుకట్ట వేసేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా ఉన్న వేళలో సజ్జన్నార్ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

ఈ సంస్థ చేసే మోసాలపై తరచూ చర్యలు తీసుకోవటంతో పాటు.. ఈ సంస్థ గురించి తెలియక భాగస్వామ్యం కావటం.. బ్రాండ్ అంబాసిడర్ లుగా ఉండే ఎంతోమంది సెలబ్రిటీలకు నోటీసులు పంపిన ఘన చరిత్ర సజ్జన్నార్ సొంతం. అలాంటి ఆయన తాజాగా మరోసారి క్యూనెట్ మోసాల పరంపరకు చెక్ చెబుతూ.. అందుకు కారణమైన నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన నిజాల్ని వెల్లడించారు. క్యూనెట్ మోసాలను బయటకు వచ్చేసిన నేపథ్యంలో.. సదరు సంస్థ ఇగ్నైట్ పేరుతో కొత్త ముసుగు వేసుకొని మార్కెట్ లోకి అడుగు పెట్టింది.

మొత్తంగా రూ.5వేల కోట్ల మోసానికి ప్లాన్ చేసిన ఈ సంస్థ గుట్టును రట్టు చేశారు హైదరాబాద్ సీపీ సజ్జన్నార్. వివిధ రాష్ట్రాల్లో పాగా వేసిన ఇగ్నైట్ డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాకు సంబంధించి కీలకమైన ఆరుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.

నోయిడాకు చెందిన ఒనియల్ గుప్తా.. యూపీలోని బులంద్ షహర్ కు చెందిన దినేష్ కుమార్ సాహిల్.. ప్రియాన్షు సక్సేనా.. కోల్ కతాకు చెందిన ప్రవీణ్.. పరితోష్ కుమార్.. కేరళకు చెందిన రియాజ్ లను అరెస్టు చేశారు. వీరంతా గతంలో క్యూనెట్ లో సీనియర్ లీడర్లుగా పని చేశారని.. ప్రస్తుతం వారంతా ఆయా రాష్ట్రాల్లో ఇగ్నైట్ సంస్థకు కీలక స్థానాల్లో ఉన్నట్లు చెప్పారు. హాంకాంగ్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇగ్నైట్ సంస్థను గత ఏడాది మే 18న చండీగఢ్ లో రిజిస్టర్ చేయించారని.. తక్కువ సమయంలో ఎక్కువమందిని ఈ సంస్థలో చేర్పించటం ద్వారా రూ.5వేల కోట్లు కొల్లగొట్టే ప్లాన్ వేసినట్లు ప్రకటించారు.

చెన్నైకు చెందిన పత్మన్ సేనాధి రాజా గోల్డ్ క్వెస్ట్ పేరుతో సంస్థను నిర్వహించారు. పదికి పైగా దేశాల్లో బ్యాన్ ఎదుర్కొన్న ఈ సంస్థ కొన్ని లక్షల మందిని మోసం చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా 50వేల కేసులు నమోదయ్యాయి. కట్ చేస్తే.. ఇదే సంస్థ నిర్వాహకులు క్యూనెట్ పేరుతో డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో మోసాలకు తెర తీశారు. వీరి మోసాలకు చెక్ చెప్పటంతో ఈసారి ఇగ్నైట్ పేరుతో మోసాలకు ప్లాన్ చేశారు. అయితే.. వీరి గుట్టు రట్టు చేయటంతో పాటు.. ఈ సంస్థకు చెందిన ముఖ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సీపీ సజ్జన్నార్ వెల్లడించారు. ఏమైనా.. ఇలాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ ఉదంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.