Begin typing your search above and press return to search.

అక్కడే తేల్చుకుందాం: సజ్జల స్ట్రాంగ్‌ కౌంటర్‌!

ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం.. దమ్ముంటే రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్‌ కు సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Feb 2024 1:20 PM GMT
అక్కడే తేల్చుకుందాం: సజ్జల స్ట్రాంగ్‌ కౌంటర్‌!
X

ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం.. దమ్ముంటే రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్‌ కు సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. దీనికి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

చంద్రబాబు అసెంబ్లీని వదిలేసి బయట చర్చలకు రమ్మంటున్నారని సజ్జల మండిపడ్డారు. అధికారంలో లేనప్పుడు ఎన్ని ఛాలెంజ్‌ లు అయినా చేస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్‌ లాంటి వాళ్లకు జగన్‌ కు ఛాలెంజ్‌ విసిరే అర్హత లేదు అని కుండబద్దలు కొట్టారు.

ఎన్నికలకు 50 రోజులు మాత్రమే ఉందని సజ్జల గుర్తు చేశారు. అక్కడ తేల్చుకుందామని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. ఇంతలోనే పనికిమాలిన ఛాలెంజ్‌ లు ఎందుకు..? అని నిలదీశారు.

ఎన్నికలకు 50 రోజుల కౌంట్‌ డౌన్‌ మొదలైందన్నారు. గెలిచేదెవరో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. మంచి చేశాం కనుకే తాము ప్రజల వద్దకు వెళ్తున్నామని సజ్జల తెలిపారు. వాలంటీర్‌ వ్యవస్థను తీసేసి జన్మభూమి కమిటీలు తెస్తాను అని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. చంద్రబాబులో ఏం చూసి ప్రజలు ఓటు వెయ్యాలి? అని నిలదీశారు. తాము చెప్పిన వాటిల్లో ఏం చెయ్యలేదో దమ్ముంటే చెప్పాలన్నారు. రాష్ట్రంలో 87శాతం ప్రజలు ప్రభుత్వం నుండి లబ్ధి పొందారని స్పష్టం చేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదు, తమను ఏమీ చేసేది లేదని సజ్జల తేలిగ్గా తీసిపారేశారు. 2014–19 మధ్య ఏం చేశారో చర్చకు వచ్చే సత్తా చంద్రబాబుకు ఉందా..? అని నిలదీశారు. చంద్రబాబు, పవన్‌.. తిట్లు తప్ప ఏమీ మాట్లాడలేకపోతున్నారని మండిపడ్డారు.

తమ ప్రభుత్వం దశలవారీగా మద్యపాన నిషేధం చేసిందని.. రాష్ట్రంలో బెల్ట్‌ షాపులు లేకుండా చేశామని గుర్తు చేశారు. దీంతో రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గిందని సజ్జల తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం కావాలి కనుక ప్రభుత్వం షాపులు నడుపుతోందని స్పష్టం చేశారు. గతంలో కంటే వినియోగం తగ్గినా.. మద్యం ఆదాయం పెరిగిందని వెల్లడించారు. గతంలో ఈ ఆదాయమంతా టీడీపీ చేతుల్లోకి పోయిందన్నారు. మద్యం విషయంలో పూర్తిగా తమ హామీ నెరవెరలేదు కాబట్టే మ్యానిఫెస్టోను 99 శాతం అమలు చేశాం అని చెబుతున్నామని సజ్జల హాట్‌ కామెంట్స్‌ చేశారు.

చంద్రబాబు ఎవరితో పొత్తులు పెట్టుకుంటే తమకెందుకని సజ్జల అన్నారు. వైసీపీ ఇంటికి వెళ్తుందని చెబుతున్న చంద్రబాబుకి పొత్తులు ఎందుకు..? కూటమి అధికారంలోకి వస్తుంది అంటున్న పవన్‌ కు పొత్తులు ఎందుకు? ఒంటరిగా పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. రెండెకరాల నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారో లోకేశ్‌ చెప్పాలన్నారు.

వాలంటీర్లు ద్వారా 660 కోట్లు అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని సజ్జల ప్రశ్నించారు. గతంలో పెన్షన్‌ పంపిణీ లో ఇలానే అవినీతి అని తప్పుడు ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. పవన్‌ పై కేసులు పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. ఎవరో ఫిర్యాదు చేస్తే కేసు పెట్టారని తెలిపారు. చంద్రబాబుతో ఉన్నాడు కనుక పవన్‌ కళ్యాణ్‌ పై కేసు పెట్టారు అనడం సరికాదన్నారు. సీపీఎస్‌ రద్దు చెయ్యాలి అనుకున్నాం.. ఎందుకు కాలేదో చెబుతున్నామన్నారు. చెయ్యగలిగిందే జగన్‌ చెప్తారు తప్ప చంద్రబాబులా మోసం చేయరని హాట్‌ కామెంట్స్‌ చేశారు.