Begin typing your search above and press return to search.

బాబు కోసమే పవన్ పుట్టాడు... చిరంజీవిపై సజ్జల హాట్ కామెంట్స్!

ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   21 April 2024 11:36 AM GMT
బాబు కోసమే పవన్  పుట్టాడు... చిరంజీవిపై సజ్జల హాట్  కామెంట్స్!
X

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పైగా... కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ.. టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిగా ఏర్పడటం మంచి పరిణామం అంటూ వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. ఈ సమయంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... పెనమలూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి అధికారం కోసమే పొత్తులతో టీడీపీ కూటమి నానా జాతి సమితి ఒకవైపు.. ప్రజల కోసం ఆలోచిస్తూ, మంచి చేసిన తాము ఒక వైపు ఉన్నామని వెల్లడించారు. ఇదే సమయంలో... నానాజాతి సమితి అంతా కలిసి అధికారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తుందని సజ్జల ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో పవన్ కల్యాణ్‌ పైనా స్పందించిన సజ్జల... ఆయనొక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని.. ఆలోచన లేని అవగాహన లేని రాజకీయ నాయకుడని.. అసలు పవన్‌ చంద్రబాబు కోసమే పుట్టాడు.. పెరిగాడు.. పార్టీ పెట్టాడు.. రాజకీయాల్లోకి వచ్చాడు అంటూ కామెంట్ చేశారు. ఇదే క్రమంలో... చంద్రబాబు బటన్ నొక్కితే పవన్ కళ్యాణ్ కదులుతాడు.. ఆగుతాడు అని చెప్పిన ఆయన... చంద్రబాబుతోనే పవన్ రాజకీయ అంకం ముగుస్తుందని తెలిపారు.

అనంతరం కూటమి అభ్యర్థులకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలపడంపైనా సజ్జల స్పందించారు. ఇందులో భాగంగా... కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ఇవ్వడంలో ఆశ్చర్యమేమీలేదని అన్నారు. ఇదే క్రమంలో... చిరంజీవి కాదు కదా ఇంక ఎంత మంది కూటమికి మద్దతు ఇచ్చినా వైసీపీకి నష్టం లేదని.. ఎంతమంది కలిసొచ్చినా కూటమికి ఒరిగేదేమీలేదని.. ఇప్పుడే ఏపీ పొలిటికల్‌ తెరపై సరైన క్లారిటీ వచ్చిందని తెలిపారు.

ఈ క్రమంలోనే ఏపీ రాజకీయ తెర మీద జగన్ ఒక్కడే ఒకవైపు ఉన్నారని.. తోడేళ్లు, గుంట నక్కలు, ముళ్ల పందులు అన్ని ఏకమై ఇంకో వైపు ఉన్నాయని అన్నారు. ప్రజల తరుపున జగన్ ఉంటే... అధికారం కోసం పెత్తందార్లంతా ఒకవైపున చేరిపోతున్నారన్నట్లుగా సజ్జల వ్యాఖ్యానించారు. అదేవిధంగా... సీఎం జగన్‌ 25వ తేదీన నామినేషన్ వేస్తారని.. రెండు రోజుల్లో మ్యానిఫెస్టో విడుదల చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.