Begin typing your search above and press return to search.

బాబు బరువుపై గట్టిగా తగులుకున్న వైసీపీ... సిగ్గుండాలన్న సజ్జల!

చంద్రబాబు కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు.

By:  Tupaki Desk   |   13 Oct 2023 1:01 PM GMT
బాబు బరువుపై గట్టిగా తగులుకున్న వైసీపీ... సిగ్గుండాలన్న సజ్జల!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో సుమారు 34 రోజులుగా ఉంటున్నారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యంపై ఈరోజు టిడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఒకరంటే... అత్యవసర వైద్యసేవలు అవసరం అని మరొకరు చెప్పుకొచ్చారు.

ఇక నారా లోకేష్ అయితే ఒక అడుగు ముందుకు వేశారు. అందులో భాగంగా చంద్రబాబుకు స్టెరాయిడ్ లు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తీవ్ర ఆరోపణలు. ఇదే సమయంలో చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు, పోలీసులు ఏదో దాస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు దోమలతో ఇబ్బందిపడుతున్నారని, స్కిన్ అలర్జీతో సమతమవుతున్నారని చెప్పుకొచ్చారు.

ఇక భువనేశ్వరి అయితే... జైల్లో ఓవర్‌ హెడ్ ట్యాంకులు శుభ్రం చేయడం లేదని, చంద్రబాబు ఆరోగంపై తనకు ఆందోళనగా ఉందని, చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, జైలులో పరిస్థితులు బాబుకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదంతా ఒకెత్తు అయితే... చంద్రబాబు ఐదుకిలోల బరువు తగ్గారని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. దీంతో అధికారులు రియాక్ట్ అయ్యారు.

ఇందులో భాగంగా... జైళ్ల డీఐజీ రవికిరణ్ స్పందించారు. చంద్రబాబు బరువు తగ్గడం కాదు.. జైలుకి వచ్చినప్పటికంటే ఒక కిలో పెరిగారని తెలిపారు. జైలుకి వచ్చినప్పుడు బాబు బరువు 66 అయితే... ఇప్పుడు 67 అని క్లారిటీ ఇచ్చారు. ఇలా అధికారులు బాబు బరువుపై క్లారిటీ ఇవ్వడంతో వైసీపీ నేతలు మైకుల ముందుకు వచ్చారు. బాబు ఫ్యామిలీ మెంబర్స్ ని, టీడీపీ నేతలను వాయించి వదిలినంత పనిచేశారు!

ఇలాంటి ప్రచారం చేయడానికి సిగ్గుండాలి - సజ్జల:

ఈ సమయంలో... చంద్రబాబుకు అనారోగ్యమంటూ టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇందులో భాగంగా... స్కిన్‌ ఎలర్జీతో ప్రాణానికే ముప్పని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు బరువు తగ్గారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి ప్రచారం చేయడానికి సిగ్గుండాలని సజ్జల దుయ్యబట్టారు.

ఇదే సమయంలో జైలు అత్తారిళ్లు కాదని... ఏసీలు పెట్టమని అడగడమేమిటని ప్రశ్నించిన సజ్జల... బాబు బ‌రువు త‌గ్గారంటే ఆయ‌న భార్య భోజ‌నంలో ఏం క‌లుపుతున్నారో? అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక.. ఇంటి ద‌గ్గరి నుంచి తెచ్చే భోజ‌నంలో ఏమైనా క‌లిపి అనారోగ్యానికి గుర‌య్యేలా చేసే అవ‌కాశం వుందని ఆయ‌న అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఇంటి దగ్గరి నుంచి తెచ్చే భోజ‌నాన్ని కూడా ప‌రీక్షిస్తున్నారని తెలిపారు.

భయాందోళనలు సృష్టించవద్దు - విజయసాయి రెడ్డి

ఇదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా... చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఇంటి భోజనం తింటున్న చంద్రబాబు బరువు ఎందుకు తగ్గుతారని ప్రశ్నించారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. అనవసర భయాందోళనలు సృష్టించవద్దని హితవు పలికారు.

గతంలో మాజీ సీఎంలు, మంత్రులు చాలామంది జైలుకు వెళ్లారని గుర్తు చేసిన సాయిరెడ్డి... అచ్చన్నలా ఏ పార్టీ వాళ్ళూ ఇలా దిగజారుడు ఆరోపణలు చేయలేదని.. లోపల చంద్రబాబు హాయిగా, ఆరోగ్యంగా ఉన్నారని.. మెప్పుకోసం ఏదో ఒకటి చెప్పి మానసిక క్షోభకు గురిచేయకండని ఈ సందర్భంగా సాయిరెడ్డి సూచించారు.

బాబు భోజనం ముందు లోకేష్ కి పెట్టాలి - మంత్రి అమర్నాథ్

ఇదే సమయంలో మంత్రి అమర్నాథ్ కూడా స్పందించారు. ఇందులో భాగంగా చంద్రబాబు ఆరోగ్యంగా ఉంటే.. బయట ఆయన కుటుంబ సభ్యులు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుబ్బయట్టారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబంపై అనుమానం కలుగుతుందని అన్నారు. ఇకనుంచి చంద్రబాబుకు ఇంటినుంచి పంపే భోజనం లోకేష్ కు పెట్టి పంపించాలని అన్నారు. ఇదే సమయంలో... చంద్రబాబుకు స్కిన్ అలర్జీ జైలుకు వెళ్లకముందే ఉందని.. అమర్నాథ్ తెలిపారు!