అమరావతి ఎఫెక్ట్.. సజ్జలపై క్రిమినల్ కేసు!
వైసీపీ కీలకనాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
By: Tupaki Desk | 23 Jun 2025 9:06 AM ISTవైసీపీ కీలకనాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ ఎస్ ఎస్ సెక్షన్లు 352,353(2), 196(1) కింద సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు తాడేపల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ ఖాజావలి తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు...ఆయనపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాజధాని అమరావతిలోని తుళ్లూరు మండలానికి చెందిన మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు ఖాజావలి వివరించారు. ఉద్దేశ పూర్వకంగా ఒక సమూహాన్ని కించపరచడంతోపాటు సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన నేరంపై ఆయనపై కేసు పెట్టామన్నారు.
ఎందుకు?
రాజధాని అమరావతి ప్రాంతంపై సాక్షి మీడియా చానెల్ డిబేట్లో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణంరాజును, సాక్షి యాంకర్ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. సాక్షిమీడియా చైర్ పర్సన్, జగన్ సతీమణి భారతి తమకు క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి కార్యాలయాల వద్ద మహిళలు ఆందోళనలు చేశారు. సాక్షినేమ్ బోర్డులను తొలగించి.. పేపర్లను తగుల బెట్టారు. జగన్ సహా జర్నలిస్టుల చిత్ర పటాలను చెప్పులతో కొట్టారు.
ఈ పరిణామాలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. అమరావతి మహిళలపై మరికొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాక్షసులు, దెయ్యాలు కూడా ఇలా చేయవని అన్నారు. ''సంకర జాతి అయితేనే ఇలా చేస్తారు'' అని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మరో దుమారానికి దారి తీశాయి. మహిళలను సంకర జాతితో పోల్చడంపై టీడీపీ సహా అన్ని పక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ క్రమంలోనే సజ్జలపై శిరీష ఫిర్యాదు చేశాయి. అయితే.. ఇది జరిగి వారం రోజులు అయిన తర్వాత.. న్యాయ నిపుణుల సలహాల మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. అయితే.. ఉన్నతాధికారుల సూచనల మేరకే తదుపరి చర్యలు ఉంటాయని వారు వెల్లడించారు.
