Begin typing your search above and press return to search.

రుషికొండ నైట్ వ్యూ : కొత్త వివాదానికి వైసీపీ తెర తీసిందా...!?

అప్పటిదాకా ఉన్న హరిత రిసార్ట్స్ ని కూలగొట్టి కొత్త నిర్మాణాలను చేపట్టడంతో రుషికొండ మీద పర్యావరణ అనుమతులు లేకుండా భవనాలు నిర్మించారు అని విపక్షం రాజకీయ రచ్చ స్టార్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   2 March 2024 10:27 AM GMT
రుషికొండ నైట్ వ్యూ :  కొత్త వివాదానికి వైసీపీ తెర తీసిందా...!?
X

విశాఖలో రుషికొండ అన్నది గత నాలుగేళ్లుగా రాజకీయ ముడి సరుకుగా పెను వివాదంగా మారిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆయన భీమిలీ నియోజకవర్గంలో ఉన్న రుషికొండ మీద నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అప్పటిదాకా ఉన్న హరిత రిసార్ట్స్ ని కూలగొట్టి కొత్త నిర్మాణాలను చేపట్టడంతో రుషికొండ మీద పర్యావరణ అనుమతులు లేకుండా భవనాలు నిర్మించారు అని విపక్షం రాజకీయ రచ్చ స్టార్ట్ చేసింది.

రుషికొండను గుండు సున్నగా చేశారు అని కూడా విమర్శించారు. మరో వైపు చూస్తే సీఎం సొంత భవనాలు కట్టుకుంటున్నారు అని కూడా యాగీ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా రుషికొండ దాకా వెళ్లి అక్కడ కట్టడాలని పరిసీలించారు. సీపీఐ నారాయణ అయితే కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని అవి పర్యాటక శాఖ కట్టడాలే అని కూడా చెప్పారు.

అయితే రహస్యంగా వాటి నిర్మాణం ఎందుకు అని విపక్షాలు ప్రశ్నిస్తూ వచ్చాయి. కానీ అన్ని అనుమతులు తీసుకుని రుషికొండ కట్టడాలు పూర్తి చేశామని రెండు రోజుల క్రితం టూరిజం ప్రాజెక్ట్ ని ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా చెప్పారు. ఈ భవనాలు విశాఖ అందాన్ని మరింతగా పెంచుతాయని ఆమె అన్నారు.

అంతర్జాతీయంగా విశాఖ టూరిస్టులకు హాట్ స్పాట్ అని అలాంటి విశాఖలో తలమానికం లాంటి నిర్మాణాలను చేపట్టామని రోజా గుర్తు చేశారు. ఇందులో కొన్ని భవనాలు సీఎం క్యాంప్ ఆఫీసు కోసం వాడుకునే అవకాశం ఉందని కూడా రోజా చెప్పడం విశేషం. త్రి మెన్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు జగన్ విశాఖకు షిఫ్ట్ అయి సీఎం క్యాంప్ ఆఫీసుని నడుపుతారు అని కూడా పేర్కొన్నారు

ఇదిలా ఉంటే ఈ భవనాలను ప్రారంభించే విషయంలో కూడా గోప్యత పాటించారు. మీడియాను అనుమతించలేదు ఇక ఫోటోలు కూడా మీడియాకు రిలీజ్ చేయలేదు. కానీ ఉన్నట్టుండి టూరిజం డిపార్ట్మెంట్ అయితే ఈ భవనాలను డ్రోన్ నుంచి తీసిన విజువల్స్ వీడియో షాట్స్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది.

రాజమందిరాన్ని తలపించేలా ఈ నిర్మాణాలు ఉన్నాయి. విద్యుద్దీప కాంతులతో ఈ భవనాలు వెలిగిపోతున్నాయి. అత్యాధునికంగా వీటిని నిర్మించారు. వైజాగ్ ది సిటీ ఆఫ్ డెస్టినీ అంటూ రిలీజ్ చేసిన ఈ భవనాలు వీటి అందాన్ని రెట్టింపు చేశాయి. ఇదిలా ఉంటే ఈ భవనాలను సీఎం క్యాంప్ ఆఫీసు గా చేస్తారని రోజా చేసిన కామెంట్స్ మీద ఇపుడు మళ్లీ రచ్చ సాగుతోంది.

ఏకంగా అయిదు వందల కోట్లు పెట్టి నిర్మించిన ఈ భవనాలు దేని కోసం ఉపయోగిస్తారు అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. వీటిని ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఇపుడు నిర్మించడం అవసరమా వారు అంటున్నారు. నిక్షేపంగా ఉన్న హరిత రిసార్ట్స్ ని కూల్చివేయడం ద్వారా రెండు వందల కోట్ల భవనాలను శిధిలం చేశారు మండిపడుతున్నారు. మొత్తం మీద చూస్తే రుషికొండ మరో మారు వివాదానికి కేంద్ర బిందువు అయ్యేలా ఉంది అని అంటున్నారు. అయితే ఈ వీడియో షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆదరణ పొందడం విశేషం. విశాఖలో ఇలాంటి భవనాలు ఉండడం గ్రేట్ అని నెటిజన్లు అంటున్నారు.