రూపాయికి చికిత్స చేసిన ఆర్బీఐ.. డాలర్ పోటీపడి మరీ పెరిగిన ఇండియన్ కరెన్సీ..
అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకొని, ముడి చమురు ధరలు మండుతున్న తరుణంలో మన రూపాయి విలువ రికార్డు స్థాయి పతనానికి చేరుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద పరీక్షగా మారింది.
By: Tupaki Desk | 30 March 2026 5:00 PM ISTఅంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకొని, ముడి చమురు ధరలు మండుతున్న తరుణంలో మన రూపాయి విలువ రికార్డు స్థాయి పతనానికి చేరుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద పరీక్షగా మారింది. అయితే, సోమవారం (మార్చి 30) భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం రూపాయికి ఊపిరి పోసింది. ఒక్కరోజే 130 పైసల భారీ లాభంతో, డాలరుతో పోలిస్తే రూపాయి 93.59 వద్ద నిలవడం ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు చిగురింపజేసింది. కేవలం మార్కెట్ ఒడిదుడుకులు మాత్రమే కాదు, బ్యాంకుల ‘ఊహాజనిత కార్యకలాపాల’ వల్ల రూపాయి పతనమవుతోందని గుర్తించిన ఆర్‌బీఐ, కఠిన నిబంధనలతో రంగంలోకి దిగింది. రూపాయికి కలిగిన ఈ తాత్కాలిక ఊరట, ఆర్బీఐ నిర్ణయంపై క్షుణ్ణంగా పరిశీలిస్తే..
ఆర్‌బీఐ ఏం చేసిందంటే..?
రూపాయి విలువ పడిపోవడానికి కేవలం అంతర్జాతీయ కారణాలే కాదు.., కొన్ని బ్యాంకులు చేస్తున్న ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ కూడా కారణమని ఆర్‌బీఐ గుర్తించింది. ఆన్‌షోర్ డెలివరబుల్ మార్కెట్‌లో బ్యాంకులు తమ నెట్ ఓపెన్ పొజిషన్ (NOP-INR)ను $100 మిలియన్లకు మించరాదని ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ నిబంధన వల్ల ప్రైవేట్, విదేశీ బ్యాంకులు తాము అక్రమంగా నిర్వహిస్తున్న దాదాపు $18 బిలియన్ల ట్రేడ్‌లను సెటిల్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఒక్కసారిగా మార్కెట్లోకి డాలర్ల సరఫరా పెరిగి, రూపాయి విలువ పెరిగింది. ఏప్రిల్ 10 లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని గడువు విధించడం రూపాయికి రక్షణ కవచంలా మారింది.
ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి దశ తిరగబడింది. యుద్ధం వల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. భారత్ తన చమురు అవసరాల కోసం అధిక మొత్తంలో డాలర్లను ఖర్చు చేయాల్సి రావడంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. యుద్ధ సమయాల్లో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోకుండా తమ సొమ్మును సురక్షితమైన 'డాలర్' వైపు మళ్లించారు. దీనివల్ల డాలర్ బలపడి, ఆసియాలోనే అత్యంత బలహీనమైన కరెన్సీలలో ఒకటిగా రూపాయి 4 శాతం మేర పతనమైంది. మార్చి 27న రికార్డు స్థాయిలో 94.85 కి పడిపోవడం దేశ ఆర్థిక భద్రతకు హెచ్చరికగా నిలిచింది.
తాత్కాలిక ఉపశమనమేనా? - నిపుణుల హెచ్చరిక!
సి.ఆర్. ఫారెక్స్ అడ్వైజరీ ఎండీ అమిత్ పాబరీ అభిప్రాయం ప్రకారం, ఆర్‌బీఐ తీసుకున్న ఈ చర్యలు కేవలం 'కృత్రిమ డిమాండ్'ను మాత్రమే తగ్గిస్తాయి అన్నారు. ఒకవేళ యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా పెరిగినా లేదంటే అమెరికా డాలర్ అంతర్జాతీయంగా మరింత బలపడినా, మళ్లీ రూపాయిపై ఒత్తిడి తప్పదని చెప్తున్నారు. ఆర్‌బీఐ ఇప్పటికే స్పాట్, ఆఫ్‌షోర్ మార్కెట్లలో జోక్యం చేసుకొని రూపాయికి మద్దతునిస్తోంది. కానీ ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదని, ప్రాథమిక ఆర్థిక మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
రూపాయి భవిష్యత్తు!
రూపాయి బలంగా ఉండాలంటే కేవలం ఆర్‌బీఐ నిబంధనలు సరిపోవు, మన ఆర్థిక మూలాలు కూడా బలంగా ఉండాలి. విదేశీ వస్తువులపై, ముఖ్యంగా చమురు, ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవాలి. మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా మన ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లోకి పంపాలి. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరిగినప్పుడే రూపాయి డాలర్ ముందు తల ఎత్తుకుని నిలబడగలదు.
సోమవారం నాటి 130 పైసల లాభం ఒక సానుకూల సంకేతం అయినప్పటికీ, రూపాయికి గండం గట్టెక్కినట్లు కాదు. యుద్ధ పరిస్థితులు, గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకులు రూపాయిని ఎటువైపు తీసుకెళ్తాయో చూడాలి. ఆర్‌బీఐ అప్రమత్తంగా ఉండి స్పెక్యులేటివ్ కార్యకలాపాలను అరికట్టడం వల్ల రూపాయి విపరీతంగా పడిపోకుండా అడ్డుకోగలిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ శక్తివంతంగా మారాలంటే రూపాయి బలపడడం అత్యంత కీలకం.
