విజయవాడ ఉత్సవాలకు చంద్రబాబు ప్రభుత్వం పని వల్ల.. ఆర్ఎస్ఎస్ Vs బీజేపీ వార్
విజయవాడ ఉత్సవాలకు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని గొడుగుపేట వెంకటేశ్వరస్వామి భూములను వాడుకోవడంపై ఆర్ఎస్ఎస్ కోర్టుకెక్కింది.
By: Tupaki Desk | 17 Sept 2025 1:03 PM ISTఏపీలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య అగ్గి రాజుకుంటోందని అంటున్నారు. విజయవాడ ఉత్సవాలకు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని గొడుగుపేట వెంకటేశ్వరస్వామి భూములను వాడుకోవడంపై ఆర్ఎస్ఎస్ కోర్టుకెక్కింది. ఆర్ఎస్ఎస్ అభ్యంతరాలను కోర్టు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ తీర్పు చెప్పడం సంచలనంగా మారింది. ఉత్సవ నిర్వహణ కమిటీకి బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ అండదండలు ఉన్నాయనే ప్రచారంతో పరివార్ నేతలతో కాషాయ దళానికి చిచ్చు మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది.
దసరా పండుగ నేపథ్యంలో విజయవాడ ఉత్సవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైసూర్ ఉత్సవాలను మరిపించేలా విజయవాడ ఉత్సవాలు నిర్వహిస్తామని బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ కూడా ప్రకటించారు. కూటమి ప్రభుత్వ ఆలోచన మేరకు జరగనున్న విజయవాడ ఉత్సవాలకు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి శివారున గొడుగుపేట వెంకటేశ్వరసామి ఆలయ భూముల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని భావించారు. దీంతో ఆ భూములను తాత్కాలిక ప్రాతిపదికన 56 రోజులకు లీజుకు ఇవ్వాలని నిర్వహకులు దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు.
విజయవాడ ఉత్సవ్ కు పర్యాటక శోభ తెచ్చే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం 40 ఎకరాల దేవుడు భూమిని తాత్కాలిక ప్రాతిపదికపై లీజుకు కేటాయించింది. దీనికి సంబంధించిన మొత్తం కూడా నిర్వాహకులు ఆలయానికి చెల్లించారు. అయితే ఈ లీజును బీజేపీ అనుబంధ సంఘ్ పరివార్ నేతలు ఆక్షేపిస్తున్నారు. దేవుడు భూముల్లో ఎగ్జిబిషన్ నిర్వహణకు అడ్డు చెబుతూ, లీజుకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు లీజును రద్దు చేస్తూ తీర్పునిచ్చినట్లు చెబుతున్నారు.
ఇక ఒకవైపు ఆర్ఎస్ఎస్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతున్న రోజే.. విజయవాడ ఉత్సవ్ సన్నాహక కమిటీ సభ్యులు ‘సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ’ అనే సంస్థ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. అంతేకాకుండా అదే రోజున ఆయన పుట్టిన రోజు కావడంతో సొసైటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. దీంతో విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు బీజేపీ సానుకూలంగా ఉన్నప్పటికీ, ఆ పార్టీకి పునాది వంటి ఆర్ఎస్ఎస్ అడ్డు చెప్పడం ఏంటి? అనేది చర్చకు తావిస్తోంది. దీంతో ఏపీలో ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య సరైన సంబంధాలు లేవా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ భూముల్లో ఉత్సవాల నిర్వహణకు ఆర్ఎస్ఎస్ కు అభ్యంతరం ఉంటే పార్టీ పెద్దల ద్రుష్టికి తీసుకువెళ్లి అడ్డుకునే అవకాశం ఉన్నా, కోర్టుకెక్కి రచ్చచేయడం వెనుక తమ అసంతృప్తి ఉండి ఉండవచ్చని అంటున్నారు. దీనివల్ల చంద్రబాబు ప్రభుత్వం కూడా విమర్శల పాలైనట్లు అభిప్రాయపడుతున్నారు.
