Begin typing your search above and press return to search.

అర్థమైందా రాజా... హోరెత్తించిన రోజా... డైలాగ్స్ పీక్స్!

అనంతరం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే రజనీకాంత్ "జైలర్" సినిమా డైలాగులతో పవన్ కళ్యాణ్, లోకేష్ ను టార్గెట్ చేశారు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 11:00 AM GMT
అర్థమైందా రాజా... హోరెత్తించిన రోజా... డైలాగ్స్  పీక్స్!
X

గతంలో ఎన్నడూ లేనట్లుగా.. ఇంతకముందు ఎప్పుడూ చూడనట్లుగా.. జగన్ చిరునవ్వులు చిందిస్తూ శ్రోతగా మిగిలిన సమయలో.. వేల మంది ప్రజానికం ఉన్న సభలో.. అది కూడా సొంత ఇలాకాలో.. మంత్రి రోజా మైకందుకున్నారు. తనదైన యతిప్రాసలతో, పదునైన డైలాగులతో విపక్షాలపై విరుచుకుపడ్డారు. సభ మొత్తాన్ని హోరెత్తించారు.

అవును... తాజాగా మంత్రి రోజా నియోజకవర్గం నగరిలో సీఎం జగన్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్‌–జూన్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ను సీఎం జగన్‌ వి డుదల చేయనున్నారు. బటన్‌ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు.

ఈ సందర్బంగా మైకందుకున్న మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా చెలరేగిపోయారు. ముఖ్యమంత్రి పదవిలో తొలిసారి నగరికి వచ్చేసిన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. నగరి నియోజకవర్గానికి సీఎం జగన్‌ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నాణ్యమైన విద్యను పేదవాడి ఆస్తిగా మార్చిన ఘనత సీఎం జగన్‌ దేనని కొనియాడారు.

అనంతరం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే రజనీకాంత్ "జైలర్" సినిమా డైలాగులతో పవన్ కళ్యాణ్, లోకేష్ ను టార్గెట్ చేశారు. నగరి సభలోనే సీఎంకు రాఖీ కట్టిన రోజా... జగన్‌ ను ఓడించేవారు ఇంకా పుట్టలేదంటూ ఫైరయ్యారు. టీడీపీ నేత నారా లోకేష్ - పవన్ కళ్యాణ్ ఊరూరా తిరిగి జగన్ ను విమర్శిస్తున్నారని రోజా మండిపడ్డారు.

ఈ సందర్భంగా... "మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండు లేని ఊరే లేదు.." అంటూ రోజా గట్టిగా డైలాగ్ పేల్చారు. అనంతరం ఇదే డైలాగును తమిళంలోనూ చెప్పిన రోజా... “అర్ధమైందా రాజా” అంటూ ముగించారు. దీంతో సభ మొత్తం ఆగకుండా అరుపులతో కేకలతో చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఎంత విమర్శించినా... లోకేష్ ఎంత మొరిగినా.. చంద్రబాబు నాయుడు ఊరూరా తిరిగి ఎన్ని అబద్దాలు చెప్పినా... ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నను మరిచిపోరని రోజా బలంగా చెప్పారు. “ట్వంటీ ట్వంటీఫోర్... జగనన్న వన్స్ మోర్” అంటూ నినదించారు.

అనంతరం.. ఇంటర్లో తాను ఏ గ్రూపు చదివాడో కూడా పవన్ కళ్యాణ్ కు తెలియదని రోజా సెటైర్ వేశారు. ఇదే సమయంలో... బైపీసీ చదివితే ఇంజనీర్ అవ్వొచ్చని చంద్రబాబు అంటారని, అటువంటి పవన్ - చంద్రబాబు లకు కూడా విద్యా కానుక ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు.

ఇదే క్రమంలో వైఎస్‌ జగన్‌ ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదని చెప్పిన రోజా... జగన్‌ ను ఓడించాలంటే అవతలివైపు కూడా జగనే ఉండాలని పంచ్ డైలాగులు పేల్చారు. ఎమ్మెల్యేగా గెలవలేని వాడు వైఎస్‌ జగన్‌ ను ఎలా ఓడిస్తాడని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రస్తుతం రోజా చెప్పిన జైలర్ డైలాగ్ ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.