Begin typing your search above and press return to search.

''ఏపీలో ఎన్నిక‌ల‌య్యాక ఆ ఇద్ద‌రూ ఇంటికే''

టీడీపీ, జనసేన కూటమికి ఓటు వేస్తే మళ్లీ కష్టాలు మొదలవుతాయని, మోసగాళ్ల చేతికి రాష్ట్రాన్ని అప్పగించేందుకు ప్రజలు సిద్దంగా లేరని దుయ్యబట్టారు.

By:  Tupaki Desk   |   7 March 2024 3:45 AM GMT
ఏపీలో ఎన్నిక‌ల‌య్యాక ఆ ఇద్ద‌రూ ఇంటికే
X

వచ్చే ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓటమి తప్పదని మంత్రి రోజా అన్నారు. పొత్తులో భాగంగా జనసేన 24 సీట్లు తీసుకుందని, అయితే, మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఆ సీట్లు కూడా రావని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కు 175 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు, పవన్ రాష్ట్రంలో కనిపించరని, హైదరాబాద్‌కు పారిపోతారని విమ‌ర్శించారు. టీడీపీ, జనసేన కూటమికి ఓటు వేస్తే మళ్లీ కష్టాలు మొదలవుతాయని, మోసగాళ్ల చేతికి రాష్ట్రాన్ని అప్పగించేందుకు ప్రజలు సిద్దంగా లేరని దుయ్యబట్టారు.

చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో'జగనన్న మహిళా మార్ట్‌`ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు కారణంగానే తెలుగు రాష్ట్రాలు విడిపోయాయని, ఆయన లాంటి మోసకారి ప్రపంచంలో ఎవరూ ఉండరని విమర్శించారు. మరోసా రి నగరి నియోజకవర్గంలో గెలిచి హ్యాట్రిక్ కొడతానని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని రోజా అన్నారు. ఎండాకాలంలో చల్లగా ఉండాలంటే'ఫ్యాన్` గుర్తుకే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలావుంటే.. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో రోజాకు సెగ త‌గులుతూనే ఉంది. ఆమెకు టికెట్ ఇవ్వవద్దంటూ ఐదు మండలాలకు చెందిన వైసీపీ నేతలు తాజాగా మ‌రో తీర్మానం చేశారు.

రోజాకు టికెట్ కేటాయిస్తే ఓడించి తీరుతామని అధిష్టానానికి హెచ్చరికలు పంపారు. రాజకీయాల్లో రోజా ఐరన్ లెగ్ అని, ఆమెకు టికెట్ ఇస్తే వైసీపీకి నష్టమని విమర్శిస్తున్నారు. తమ వల్లనే రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, అయితే ఆమె నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో కమిషన్లు రౌడీయిజం, భూకబ్జాలు పెరిగిపోయాయని, ఆమె లాంటి మంత్రిని ఇప్పటివరకు చూడలేదని ఐదు మండలాలకు చెందిన వైసీపీ ఇంచార్జ్‌లు తీవ్ర విమర్శలు చేశారు.

మ‌రోవైపు వచ్చే ఎన్నికల్లో రోజా గెలిచే పరిస్థితి లేదని పలు సర్వే నివేదికలు జగన్‌కు అందినట్లు తెలుస్తోంది. దీంతో రానున్న ఎన్నికల్లో రోజాకు టికెట్ దక్కదనే టాక్ నడుస్తోంది. రోజాకు ప్రత్యామ్నాయంగా మరో బలమైన నేత కోసం జగన్ చూస్తున్నట్లు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆమెకు ఇప్ప‌టి వ‌రకు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేద‌ని అంటున్నారు. అయితే నియోజకవర్గంలో బలమైన నేత ఎవరూ లేకపోవడంతో రోజాకే మరోసారి టిెకెట్ ఇచ్చే అవకాశముందని మ‌రో ప్రచారం జరుగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.