Begin typing your search above and press return to search.

తగ్గేదేలే అంటున్న రోజా.. పవన్ పై షాకింగ్ కామెంట్స్, వీడియో వైరల్

ప్రజలకు రేషన్ పంపిణీ చేసే వాహనాలకు డబ్బులు లేవని చెబుతూ, వీళ్లు మాత్రం హెలికాఫ్టర్, విమానాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు.

By:  Tupaki Desk   |   22 July 2025 6:44 PM IST
తగ్గేదేలే అంటున్న రోజా.. పవన్ పై షాకింగ్ కామెంట్స్, వీడియో వైరల్
X

అనుచిత, అభ్యంతరక వ్యాఖ్యలను సహించేది లేదని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తున్నా, వైసీపీ, టీడీపీ నేతలు తగ్గేదేలే అంటున్నారు. పోటాపోటీగా దూషణలకు దిగుతూ రాజకీయంగా రచ్చ చేస్తున్నారు. తాజాగా నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజాపై సిట్టింగు ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి రోజా ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమెకు కౌంటరుగా టీడీపీ కూటమి నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై రోజా చేసిన వ్యాఖ్యల వీడియోను బయటపెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కూటమి నేతలను లక్ష్యంగా చేసుకుని రోజా చేస్తున్న వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ మీడియా చానల్ తో మాట్లాడిన రోజా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే పారిపోతారని హెచ్చరించడంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ పై రోజూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం కొత్తమలుపు తీసుకుంది. ‘‘ఈ ఎమ్మెల్యేలు గాల్లో గెలిచిన గాలి..’’ అంటూ రోజా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విమర్శిస్తున్నారు. ఒక్కరు కూడా ప్రజల వద్దకు వెళ్లి ఏం కష్టమో అడగరని ఆక్షేపించారు. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన నాయకులు హైదరాబాదుకు కాదు అమెరికాకు పారిపోతారని రోజా హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీకెండ్ నాయకులు అంటూ రోజా కామెంట్ చేశారు.

ప్రజలకు రేషన్ పంపిణీ చేసే వాహనాలకు డబ్బులు లేవని చెబుతూ, వీళ్లు మాత్రం హెలికాఫ్టర్, విమానాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులను ఇబ్బంది పెడితే వందకు వంద చెల్లిస్తామని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక పవన్ కల్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిందని.. ఎక్కడికి వెళితే అక్కడ పుట్టానంటాడని రోజా ఎద్దేవా చేశారు. చివరకు సుబ్రహ్మణ్యస్వామి అభిమానిని అంటూ చెప్పుకోవడంపైనా రోజా విమర్శలు గుప్పించారు. తనపై ఎమ్మెల్యే చేసిన విమర్శలతో కంటపడిన రోజా.. ఇతర నాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడవచ్చా? అంటూ జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక రోజా వ్యవహారశైలిపై స్పందించిన శాప్ చైర్మన్ రవినాయుడు మీడియాతో మాట్లాడుతూ రోజాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని హెచ్చరించారు. మరో పది రోజుల్లో ఆమె అరెస్టు ఖాయమంటూ రవినాయుడు వ్యాఖ్యానించారు.