Begin typing your search above and press return to search.

బాబు ప్రమాణానికి రేవంత్ రెడ్డి రెడీ !

అలాంటి వారిని ఆయన ప్రోత్సహిస్తారు. అలా రేవంత్ రెడ్డి ని బాబు టీడీపీలో టాప్ లీడర్ గా మార్చారు

By:  Tupaki Desk   |   6 Jun 2024 10:51 PM IST
బాబు ప్రమాణానికి రేవంత్ రెడ్డి రెడీ !
X

టీడీపీలోనే రేవంత్ రెడ్డి ఎదిగారు. చంద్రబాబు ఆయనను ఎంతో ఆదరించారు. అతి తక్కువ కాలంలో రేవంత్ రెడ్డిని చాలా కీలకమైన స్థానానికి బాబు చేర్చారు. బాబుకు ప్రతిభావంతులు అంటే ఇష్టం. అలాంటి వారిని ఆయన ప్రోత్సహిస్తారు. అలా రేవంత్ రెడ్డి ని బాబు టీడీపీలో టాప్ లీడర్ గా మార్చారు.

అనేక ఇతర కారణాల వల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినా బాబు అంటే అదే ప్రేమాభిమానాలు ఆయనకు ఉన్నాయి. రేవంత్ రెడ్డి తన మనసులో బాబును గురువుగానే భావిస్తారు. ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కూడా అనతికాలంలో ఎదిగి ముఖ్యమంత్రి అయ్యారు. డిసెంబర్ లో సీఎం అయిన రేవంత్ రెడ్డి ఏపీకి ఇటీవలే వచ్చారు. ఆయన అనధికార పర్యటనగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి వెళ్లారు.

అయితే రేవంత్ రెడ్డి అధికారిక పర్యటన ఏపీలో షురూ అయింది. ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరిస్తున్న నేపధ్యంలో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా హాజరవుతున్నారు. ఏపీలో టీడీపీ కూటమి విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి ఇప్పటికే ఫోన్ చేసి చంద్రబాబుని అభినందించారు. బాబు కూడా ఆయనకు తన ప్రమాణ స్వీకారానికి రమ్మని ఆహ్వానించారు. తొందరలో అధికారిక ఆహ్వానం పంపుతామని కూడా చెప్పినట్లుగా భోగట్టా.

ఇదిలా ఉండగా ఈ ఫోన్ సంభాషణలో రేవంత్ రెడ్ది ఏపీ తెలంగాణా రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలని బాబుని కోరినట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే గురు శిష్యులు ఇద్దరూ చాలా కాలానికి ఒకే వేదిక మీద కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇతర కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరవుతున్నట్లుగా భోగట్టా. అయితే కాంగ్రెస్ నుంచి పెద్దలు హాజరు కారు అని అంటున్నారు. కానీ అదే పార్టీ నుంచి రేవంత్ రెడ్డి హాజరు కావడమే ఒక స్పెషాలిటీగా ఉంటుందని అంటున్నారు.