Begin typing your search above and press return to search.

సీబీఎన్ ను ఎదిరించిన రేవంత్! అసెంబ్లీలో వెల్లడి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   4 Jan 2026 12:52 PM IST
సీబీఎన్ ను ఎదిరించిన రేవంత్! అసెంబ్లీలో వెల్లడి
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు చంద్రబాబు అంటే తనకు ఎంతో గౌరవమని, ఆయనను విమర్శించమని చాలా మంది చెప్పినా, తాను ఆ పని చేయలేదని చెబుతూ వస్తున్న రేవంత్ రెడ్డి శనివారం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. సీఎం ప్రసంగం అనంతరం గురుశిష్యుల బంధంలో సంవాదం కూడా ఉందా? అనే చర్చ జరుగుతోంది. ‘నీళ్లు-నిజాలు’ అనే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపితేనే ఏపీ ప్రభుత్వంతో చర్చలకు వస్తానని చంద్రబాబుకు తేల్చిచెప్పానని ప్రకటించారు. చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చి ఆ ప్రాజెక్టును నిలిపివేసినట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే తాను తెలంగాణ కోసం ఎవరితోనైనా పోరాడతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘‘ఆయన (చంద్రబాబు) నాయకత్వంలో పనిచేసిన నేను ఆయన నాయకత్వాన్ని కాదని, ఆయన నాయకత్వాన్ని వదులుకుని కాంగ్రెసులో చేరిన నేను ప్రజలకు ద్రోహం చేస్తానా’’ అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును ఎదిరించి తెలంగాణ కోసం తాను అసెంబ్లీలో ఏం మాట్లాడానో తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తే జూరాల నుంచి 70 టీఎంసీలను నీళ్లను తీసుకుని పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు నీళ్లను తరలిస్తానని, ఎవరు అడ్డు వస్తారో చూస్తానంటూ రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ను ఎదిరిస్తానని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణపై ఆన ఈ కుర్చీలో ఉన్నంత కాలం తెలంగాణకు నష్టం కలిగే చిన్న తప్పు కూడా చేయబోను అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇన్నాళ్లు తాను సాధించిన విజయాలను చెప్పలేదు అంటూ రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఏ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడారో కానీ, చంద్రబాబును ఎదిరించినట్లు సీఎం తొలిసారిగా చెప్పడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న రేవంత్ రెడ్డి గతంలో ఎప్పుడూ ఇలా చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబును ఎదిరించినట్లు చెప్పడమే కాకుండా, ఆయన పేరు ప్రస్తావిస్తూ జూరాల నుంచి నీళ్లు తెచ్చుకుంటే ఎలా ఆపుతారో చూస్తానని ప్రకటించడం కూడా చర్చకు దారితీస్తోంది. ఇదే సమయంలో తనకు చంద్రబాబు అంటే భయం లేదని, కేసీఆర్ మాత్రం తన పాత యజమానిని (చంద్రబాబు) చూస్తే భయపడతారని వ్యాఖ్యానించారు.

‘‘ఒక వేళ చంద్రబాబు ముందు మాట్లాడటానికి నీకు భయం అవ్వొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నీకు పాత యజమాని కాబట్టి, పాత యజమాని ముందు నిలబడి మాట్లాడటానికి కడుపులో గుబులు ఉండొచ్చు. పాత యజమాని ముందు మాట్లాడాలంటే కొన్నిసార్లు నెర్వెస్ అయిపోతాం. 2016లో చంద్రబాబు ముందు నిలబడి మాట్లాడటానికి బయటపడి మాట్లాడలేకపోతే, 2020లో నీకన్నా చిన్నోడు, తొలిసారి ముఖ్యమంత్రి జగన్ ముందు మాట్లాడటానికి భయపడిపోయావా’’ అంటూ కేసీఆర్ పై సీఎం రేవంత్ మాటల దాడి చేశారు. మొత్తానికి అసెంబ్లీ ఎపిసోడ్ లో తాను చంద్రబాబును ఎదిరించానని చెప్పడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఏపీ సీఎంను కేంద్ర బిందువుగా మార్చేశారని అంటున్నారు.