Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేతకు షాక్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను హైదరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

By:  Tupaki Desk   |   12 July 2026 8:56 PM IST
సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేతకు షాక్!
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను హైదరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం గుంటూరులోని నాగార్జున యాదవ్ నివాసానికి వచ్చిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు నోటీసు ఇవ్వకుండా తీసుకువెళుతున్నారని కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పగా, నల్లపాడు పోలీసుస్టేషన్ లో సమాచారమిస్తామని చెబుతూ పోలీసులు నాగార్జున యాదవ్ ను హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ పరిణామం ఏపీలో తీవ్ర కలకలం రేపింది.

ఇటీవల సాక్షి టీవీ డిబేట్ లో పాల్గొన్న నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. డిబేడ్ నిర్వాహకుడు కొమ్మినేని శ్రీనివాసరావు వారిస్తున్నప్పటికీ నాగార్జున యాదవ్ నోటికివచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డిని దుషించారని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా, నాగార్జున యాదవ్ ను అరెస్టు చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు డిమాండ్ చేశారు. అయితే ఆదివారం వరకు ఈ విషయంపై పెద్దగా హడావుడి చేయని హైదరాబాద్ పోలీసులు ఆకస్మాత్తుగా నాగార్జున యాదవ్ ను అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాగార్జున యాదవ్ పై చర్యలకు డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ డిబేట్ జరుగుతోంది. అయినప్పటికీ నాగార్జున యాదవ్ వెనక్కి తగ్గలేదని అంటున్నారు. దీంతో పోలీసులు అరెస్టుకు మొగ్గు చూపారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా ఇటీవల హైదరాబాద్ లో యూట్యూబర్ కేవీఆర్ అరెస్టు సందర్భంగా తెలంగాణ వాదులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చి ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఏపీకి వచ్చి అరెస్టు చేయడం చర్చకు తావిస్తోంది. దీనిపై తెలంగాణ వాదులు ఎలా స్పందిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు నాగార్జున యదవ్ అరెస్టు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీసం జీవో చదవడం రాదని, డెలవరీ బాయ్ అంటూ నాగార్జున యాదవ్ దూషించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఓటుకు నోటు కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ నాగార్జున యదవ్ ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అయితే నాగార్జున యాదవ్ వ్యాఖ్యలను డిబేట్ నిర్వహకుడు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని గౌరవించాలని, వ్యక్తిగత విమర్శలు సరికాదని హితవు పలికారు. కానీ నాగార్జున యాదవ్ వినిపించుకోకుండా తన వ్యాఖ్యల వల్ల డెలవరీ బాయ్స్ మనోభావాలు దెబ్బతింటే వారికి క్షమాపణ చెబుతానని వ్యాఖ్యానించారు. దీంతో నాగార్జున యాదవ్ ను అరెస్టు చేయాలని తీవ్ర ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు.