సీఎం రేవంత్ తాజా ఢిల్లీ టూర్ అందుకేనా?
ప్రతి పనికి ఢిల్లీ ఆమోదముద్ర అవసరం అవుతుందని.. ముఖ్యమంత్రికి వెన్నుముక ఉండదని.. ప్రతి నిర్ణయానికి వారి నుంచి అనుమతి తీసుకోవాలంటూ మండిపడుతుంటారు.
By: Tupaki Desk | 9 Jun 2025 4:47 PM ISTప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై తరచూ విమర్శలు చేస్తుంటాయి. ప్రతి పనికి ఢిల్లీ ఆమోదముద్ర అవసరం అవుతుందని.. ముఖ్యమంత్రికి వెన్నుముక ఉండదని.. ప్రతి నిర్ణయానికి వారి నుంచి అనుమతి తీసుకోవాలంటూ మండిపడుతుంటారు. ఇలాంటి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. జాతీయ పార్టీల తీరు ఎలా ఉంటుందన్న దానికి ఆయన మాటలు నిదర్శనంగా చూపిస్తుంటారు.
తాజాగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూసినప్పుడు.. కేసీఆర్ మాటల్లో నిజం ఉంది కదా? అనిపించే పరిస్థితి. మంత్రివర్గ విస్తరణ ఎపిసోడ్ గురించి తెలిసిందే. నెలల తరబడి సా..గిన ఈ క్రతువు ఒక కొలిక్కి వచ్చేందుకు నెలల సమయం పట్టింది. మొత్తం ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉన్నా.. ముగ్గురికి మాత్రమే ఛాన్స్ ఇవ్వటం.. ఆశావాహులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.
మంత్రివర్గ విస్తరణ ఎపిసోడ్ లో భాగంగా.. సీఎం రేవంత్ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారో తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ఈసారి ఢిల్లీ టూర్.. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా మంత్రి పదవులు పొందిన వారికి కేటాయించాల్సిన శాఖల మీద క్లారిటీ కోసమే వెళ్లినట్లుగా చెబుతున్నారు. తాజాగా మంత్రులుగా అవకాశం పొందిన ముగ్గురూ ఎమ్మెల్యేలుగా మొదటిసారి గెలిచిన వారే. అలాంటప్పుడు వారికి ఫలానా శాఖనే కేటాయించాలన్న పంచాయితీ ఉండదు. అయినప్పటికీ.. సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లారంటే.. కొత్తగా మంత్రులు కేబినెట్ లోకి వచ్చిన వేళ.. పాత వారి శాఖల్ని సైతం మార్చే ప్లాన్ లో ఉన్నారా? అన్న ప్రశ్న కలుగక మానదు.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తాజా మంత్రివర్గ విస్తరణ వేళ.. మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. ఇలాంటి వాటి విషయాల్లో ముఖ్యమంత్రికి అధినాయకత్వం స్వేచ్ఛ ఇస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. అప్పుడే పాలనపై మరింత పట్టుకు అవకాశం ఉంటుందని చెప్పకతప్పదు. ప్రతి దానికి ఢిల్లీకి వెళ్లి ఓకే చేయించుకోవటం కాంగ్రెస్ కు మంచిది కాదంటున్నారు. ఎన్నిఎదురుదెబ్బలు తగిలినా.. దశాబ్దాల తరబడి సాగుతున్న సంప్రదాయాల్ని కాంగ్రెస్ అధిష్టానం విడిచి పెట్టి.. ముఖ్యమంత్రులకు కాస్తంత ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుందా?