బుక్కిష్ పాలిటిక్స్
ఏంటో రంగుల రాజకీయం అయిపోయింది మరీ బొత్తిగా బుక్కిష్ పాలిటిక్స్ కూడా అయిపోతోంది. లేకపోతే ఏమిటిది.
By: Tupaki Desk | 26 April 2025 5:00 AM ISTఏంటో రంగుల రాజకీయం అయిపోయింది మరీ బొత్తిగా బుక్కిష్ పాలిటిక్స్ కూడా అయిపోతోంది. లేకపోతే ఏమిటిది. విడ్డూరం కాకపోతే. పాలన చేయాలంటే ఒక్కటే బుక్ ఉండాలి అంది అంబేద్కర్ రాసిన రాజ్యాగం బుక్. కానీ ఎవరికి తోచిన తీరున వారు బుక్స్ రాస్తూ వాటినే అమలు చేయాలనుకుంటే కనుక వీటికి అంతు ఎక్కడ ఉంటుంది.
యువ నేత లోకేష్ నాటి వైసీపీ ప్రభుత్వం హయాంలో తమ పార్టీ వారి మీద జరిగిన అరాచకాలను నిలదీసే క్రమంలో రెడ్ బుక్ ని పరిచయం చేశారు. అందరి లెక్కలూ రెడ్ బుక్ లో ఉంటాయని కూడా హెచ్చరించారు. టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది.
అయ్తే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని వైసీపీ విమర్శలు మొదలెట్టింది. రెడ్ బుక్ లో తమ ప్రత్యర్ధుల వ్యతిరేకుల పేర్లు రాసి వారిని అక్రమంగా ఇరికిస్తునారు అని ఆరోపిస్తోంది. దానికి టీడీపీ ధీటైన బదులు ఇస్తోంది. అఫ్ కోర్స్ ఈ వివాదం అలా ఉండగానే వైసీపీ సైతం అదే రూట్లో వెళ్ళడమే వింతల్లోకెల్లా వింత.
వైసీపీ నేతలు ఇపుడు బ్లూ బుక్ రాసే పనిలో బిజీగా ఉన్నారట. ప్రతీ నియోజకవర్గంలో వైసీపీ నేతల మీద దాడులు వాటిని ప్రోత్సహిస్తున్న శక్తుల గురించి ఆ బ్లూ బుక్ లో ఎంతో అందంగా రాసి జాగ్రత్తగా పెట్టుకుంటున్నారుట.
ఇక ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం కలిగిన వారు చాలా లాజికల్ గా ఈ బుక్స్ రాస్తున్నారుట. వీరు ప్రత్యర్ధుల పేర్లను రాసి ఊరుకోవడం లేదుట. వ్యవస్థలో తప్పులను పట్టుకుంటున్నారు. కూటమి సర్కార్ హాయాంలో సాగుతున్న తప్పులను పట్టుకుని వాటిని డిజిటల్ గా డాక్యుమెంటేషన్ చేస్తున్నారుట.
ఈ విధంగా చేయడం వల్ల ఫ్యూచర్ లో తమకు గనుక పవర్ చిక్కితే ఆ తప్పులు చేసిన వారికి టిట్ ఫర్ టాట్ రూల్ ని అప్లై చేయవచ్చు అన్నది వారి ఆలోచనట. ఈ విధంగా పోటీలు పడి ఒక నియోజకవర్గం వారు రాస్తున్నారు అని మరో నియోజకవర్గం వారు బ్లూ బుక్స్ ని తెరుస్తున్నారుట.
రెడ్ బుక్ కి కౌంటర్ గా బ్లూ బుక్ అని అంటున్నా ఈ విధంగా చేయడం వల్ల రాజకీయ లాభం కంటే బూమరాంగ్ అయ్యేదే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. తప్పులు చేసిన వారిని దండించేందుకు చట్టాలు ఉన్నాయి. వాటిని సజావుగా వాడితే అవినీతి అక్రమార్కులకు శిక్ష పడుతుంది.
అంతే తప్ప సొంత బుక్స్ తో రాజకీయం చేయాలనుకుంటే ఈవాళ వారు రేపు వీరు ఇంకో రోజు ఇంకొకరు ఇలాగే వ్యవస్థలో ఉంటుంది తప్ప కోరుకున్న మార్పులు అనేవి ఉండవని అంటున్నారు. మొత్తానికి అందరూ బుక్స్ అంటూ బుద్ధిమంతులు మాదిరిగా రాస్తూ కూర్చుంటే రాజకీయం ఏ వైపునకు సాగుతుందో అన్న చర్చ కూడా ఉంది మరి.
