Begin typing your search above and press return to search.

అమరావతి టు అసెంబ్లీ.. రాయపాటి శైలజకు ఆఫర్.. 2029లో బిగ్ ట్విస్ట్

రాజధాని అమరావతి ఉద్యమకారిణిగా గుర్తింపు సాధించి కూటమి ప్రభుత్వంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన రాయపాటి శైలజ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నారా?

By:  Tupaki Desk   |   4 April 2026 8:00 PM IST
అమరావతి టు అసెంబ్లీ.. రాయపాటి శైలజకు ఆఫర్.. 2029లో బిగ్ ట్విస్ట్
X

రాజధాని అమరావతి ఉద్యమకారిణిగా గుర్తింపు సాధించి కూటమి ప్రభుత్వంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన రాయపాటి శైలజ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నారా? ఆమెను పార్టీలో చేర్చుకుని రాజధాని ప్రాంతంలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీకి నిలపాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందా? ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ఈ అనుమానాలు నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. 2029 ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారని, దీంతో కొత్తగా సమర్థులైన మహిళా నేతలను రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు.

రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినప్పటికి రాయపాటి శైలజకు ఇప్పటివరకు ఏ పార్టీతో సంబంధం లేదని అంటున్నారు. గతంలో అమరావతి రాజధానిని కాపాడుకునేందుకు రైతులు చేపట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపిన శైలజ టీడీపీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారని చెబుతున్నారు. ఆమె కుటుంబానికి టీడీపీతో అనుబంధం ఉన్నప్పటికీ శైలజ మాత్రం ఆ పార్టీ తరఫున ఇప్పటివరకు పనిచేయలేదని, కేవలం అమరావతి ఉద్యమం వరకు పరిమితమయ్యారని అంటున్నారు.

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రాజధాని ఉద్యమం కూడా ఒక కారణంగా భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పట్లో ఉద్యమంలో ముందుండి నడిపిన రాయపాటి శైలజ తెగువను మెచ్చుకుని మహిళా కమిషన్ గా నియమించారు. ఇక ఇప్పుడు కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు అవుతుండటం, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సివుండటంతో రాయపాటి శైలజను పార్టీలోకి తీసుకువచ్చి ఆమె సేవలను రాజకీయంగా వాడుకోవాలని టీడీపీ హైకమాండ్ భావిస్తోందని అంటున్నారు.

ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే సగం పదవీకాలం పూర్తికావడంతో మిగిలిన సమయం ముగిసిన తర్వాత రాయపాటి శైలజను ఏదో ఒక నియోజకవర్గానికి ఇంచార్జిగా నియమించాలని సీఎం భావిస్తున్నారని అంటున్నారు. సామాజికంగా ఆర్థికంగా కూడా ఆమె బలంగా ఉండటంతో ఏ స్థానం అప్పగించాలనే విషయమై టీడీపీ హైకమాండ్ తర్జనభర్జన పడుతోందని అంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారని, అదేవిధంగా కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు, మహిళా రిజర్వేషన్ కు అవకాశం ఉండే స్థానాలను పరిశీలిస్తున్నారని అంటున్నారు.