ఆ యువనేతపై చంద్రబాబు నిఘా..!
రాజకీయాల్లో వారసత్వం ఒక్కటే పనిచేయదు. ఒక్కసారికి మాత్రమే వారసత్వం పనిచేస్తుంది. తర్వాత.. వ్యక్తిగతంగా నాయకులు ఎదగాలి.
By: Tupaki Desk | 17 July 2025 8:15 AM ISTరాజకీయాల్లో వారసత్వం ఒక్కటే పనిచేయదు. ఒక్కసారికి మాత్రమే వారసత్వం పనిచేస్తుంది. తర్వాత.. వ్యక్తిగతంగా నాయకులు ఎదగాలి. మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నాలు చేయాలి. అలా కాకుండా.. చిందులు తొక్కితే.. పెను ప్రమాదం మూటగట్టుగట్టుకున్నట్టే అవుతుంది. భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కీలకమైన మంత్రిపదవులు కూడా దక్కడం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పుడు రాయల సీమలోని ఓ యువ ఎమ్మెల్యే వ్యవహారం కూడా ఇలానే తయారైందని అంటున్నారు.
సీమకు చెందిన ఈ ఎమ్మెల్యే యువ నాయకుడు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో పరాజయం పాలైనా.. గత ఏడాది కూటమి హవాతో కొట్టుకువచ్చారు. కానీ, నోటి దూలతో తొలి ఆరు మాసా ల్లోనే ఆయన వివాదం అయ్యారు. అధికారులను బూతులు తిడుతూ.. రెచ్చిపోయారు. దీనిపై పార్టీ అధి ష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సరిచేసుకున్నారు. కానీ.. ఆ తర్వాత..ఇసుక, మద్యం వ్యవహారాల్లో వేళ్లు, కాళ్లు కూడా పెట్టారు. ఇది ఏకంగా.. సదరు నియోజకవర్గం నాయకులు మూకుమ్మడిగా.. పార్టీ అధిష్టానం దగ్గర ఫిర్యాదు చేసే పరిస్థితిని తీసుకువచ్చింది.
చివరకు మధ్యే మార్గంగా ఒప్పందాలు చేసుకున్నారు. కట్ చేస్తే.. ఈయన చేస్తున్న విషయాలపై.. కూటమి లోని ఓ పార్టీ నాయకురాలు నిఘా పెట్టినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. రివర్స్‌లో ఈ యువ నాయకుడు కూడా.. ఆమెపై నిఘా పెట్టారు. ఇది పెను దుమారానికి దారితీయడం.. ఆ తర్వాత.. ఆమె కేసుల్లో చిక్కు కోవడం తెలిసిందే. ఏకంగా పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. అయితే.. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు ఇక్కడే మొదలైంది. వరుస వివాదాల్లో చిక్కుకుని.. కూటమిపై ఎఫెక్ట్ చూపించే స్థాయిలోకి వచ్చిన సదరు యువ నేతపై చంద్రబాబు సైతం నిఘా పెట్టారని తెలిసింది.
అసలు దైనందిన చర్య ఎలా ఉంది? ఆయన ఏం చేస్తున్నాడు? ప్రజల మధ్య ఉంటున్నారా? ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారా? లేదా? అనే విషయాలపై సదరు నాయకుడి తాలూకు వ్యవహారాలను తెలుసుకునేందుకు పక్కా ప్రణాళికతో నేరుగా సీఎంవో అధికారులు రంగంలోకి దిగారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఈ విషయం సదరు నాయకుడి వరకు చేరిపోయింది. నారా లోకేష్ టీంలో ఉండడంతో దీనిపై ఆయనకు ఉప్పందింది. మరి ఇప్పుడు ఆయన పద్ధతి మార్చుకుంటారో లేదో చూడాలి. ఏదేమైనా మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు.. ఇలా చేయడం పట్ల అంతర్గత చర్చల్లో నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
