Begin typing your search above and press return to search.

అవును.. మంత్రి బుగ్గన సమీప బంధువునే.. జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ

దీనిపై రవికిరణ్ స్పందించారు. తాను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాత్ రెడ్డికి సమీప బంధువునని

By:  Tupaki Desk   |   17 Sep 2023 4:51 AM GMT
అవును.. మంత్రి బుగ్గన సమీప బంధువునే.. జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ
X

స్కిల్ స్కాం ఆరోపణలతో ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబును రిమాండ్ కు తరలించటం.. అందులో భాగంగా ఇప్పుడు ఆయన రాజమహేంద్రవరంలోని జైల్లో కాలం గడుపుతూ ఉండటం తెలిసిందే. కుటుంబ కారణాలతో ఇప్పటివరకు రాజమహేంద్రవరం జైలుకు సూపరిండెంట్ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టటం తెలిసిందే. ఆయన స్థానంలో జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీగా ఎం.ఆర్. రవికిరణ్ వ్యవహరిస్తున్నారు. ఆయన ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై రవికిరణ్ స్పందించారు. తాను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాత్ రెడ్డికి సమీప బంధువునని.. అంత మాత్రాన తాను ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడన్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ నాయకులతో బంధుత్వం ఉన్నంత మాత్రాన నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తానన్న ఆలోచన సరికాదన్న మాట ఆయన నోటి నుంచి రావటం గమనార్హం.

విపక్ష నేత చంద్రబాబు జైల్లో ఉన్న వేళ.. రాజమండ్రి జైలుకు ఇన్ ఛార్జి సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టిన వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు. నిజానికి ఆరోపణలు.. విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉన్న పోస్టుల్లో అధికారులకు బాధ్యత అప్పగించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రిమాండ్ లో ఉన్న చంద్రబాబు భద్రతపై లోకేశ్ అనుమానాలు వ్యక్తం చేయటంతోనే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ఇన్ ఛార్జి సూపరింటెండెంట్ గా బాధ్యతల్ని తనకు తాత్కాలికంగా అప్పగించారని.. ఈ విషయంలో తనకు.. జైళ్లశాఖకు ఎలాంటి దురుద్దేశాలు అంటగట్టొద్దని పేర్కొన్నారు.

చంద్రబాబుతో ములాఖత్ కోసం ఆయన సతీమణి భువనేశ్వరి చేసుకున్న అప్లికేషన్ ను రూల్ ప్రకారమే తిరస్కరించామనే తప్పించి.. మరెలాంటి కారణం లేదన్నారు. చంద్రబాబు భద్రతమీద అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే.. 12 రాత్రి జైల్లో రాత్రి వేళలో తాను స్వయంగా రౌండ్ వేసినట్లుగా పేర్కొన్నారు.