Begin typing your search above and press return to search.

వెటకారం... ఇద్దరు వర్మల మధ్యలో పవన్ కల్యాణ్!

రానున్న ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

By:  Tupaki Desk   |   14 March 2024 1:27 PM GMT
వెటకారం... ఇద్దరు వర్మల మధ్యలో పవన్ కల్యాణ్!
X

రానున్న ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో చాలా కాలం నుంచి లైవ్ లో ఉన్న సస్పెన్స్ కు తెరదించినట్లయ్యింది. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో.. పిఠాపురంలో జరుగుతున్న రచ్చ సంగతి కాసేపు పక్కనపెడితే... ఆన్ లైన్ వేదికగా రాం గోపాల్ వర్మ ఎంటరైపోయారు. ఒక సర్ ప్రైజ్ ట్వీట్ చేశారు.

అవును... రానున్న ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు పవన్ ప్రకటించిన అనంతరం.. ఆర్జీవీ ఆన్ లైన్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... "ఆకస్మిక నిర్ణయం.. నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. అనంతరం... "డౌట్ పడేవారందరికీ చెబుతున్నా... నేను సీరియస్ గానే ఉన్నాను" అని మరో ట్వీట్ చేశారు. దీంతో ఇద్దరు వర్మల మధ్యలో పవన్ కల్యాణ్ @ పిఠాపురం అనే చర్చ తెరపైకి వచ్చింది.

కాగా... పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం స్థానిక టీడీపీ కార్యకర్తలు నిప్పులు చెరగడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా లోకేష్, చంద్రబాబు, పవన్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మకు మద్దతుగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో 2014 ఎన్నికల్లో ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో... రాం గోపాల్ వర్మ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అది పార్టీ టిక్కెట్ పైనా.. లేక, ఇండిపెండెంట్ గానా అనే విషయం మాత్రం వెల్లడించలేదు. తాను మాత్రం ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నట్లు మాత్రం తెలిపారు. దీంతో... వర్మ - వర్మ మధ్యలో పవన్ కల్యాణ్ @ పిఠాపురం అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు!

అయితే... ఇది పూర్తిగా వెటకారపు ప్రకటన అని అంటున్నారు ఆర్జీవీ ఫ్యాన్స్. పిఠాపురంలో పోటీచేస్తున్నట్లు పవన్ ఇప్పటికిప్పుడు ప్రకటించినప్పుడు, తాను మాత్రం సడన్ గా ప్రకటిస్తే ఏమిటనే ఉద్దేశ్యం అయ్యి ఉండొచ్చని అంటున్నారు. ఇదే సమయంలో... ఓడిపోయే దానికి ఎక్కడ పోటీ చేస్తే ఏమిటి.. తాను కూడా అలానే అని వర్మ సెటైర్ వేసి ఉండొచ్చని మరికొంతమంది చెబుతున్నారు.