Begin typing your search above and press return to search.

అనకాపల్లి సీటు వద్దంటున్న సీఎం రమేష్...!?

పొత్తులలో భాగంగా టీడీపీ కూటమి బీజేపీకి అనకాపల్లి ఎంపీ సీటు కేటాయించింది. ఆ సీటు అన్నది బీజేపీకి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది

By:  Tupaki Desk   |   3 April 2024 7:07 PM GMT
అనకాపల్లి సీటు వద్దంటున్న సీఎం రమేష్...!?
X

పొత్తులలో భాగంగా టీడీపీ కూటమి బీజేపీకి అనకాపల్లి ఎంపీ సీటు కేటాయించింది. ఆ సీటు అన్నది బీజేపీకి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతే కాదు ఆ సీటు కోసం ఎంపిక చేసిన అభ్యర్థిని చూసి ఇంకా విస్మయానికి గురి అయ్యారు. ఎక్కడో కడప జిల్లా వాసిగా ఉన్న రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్ ని తెచ్చి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని చేసిన ఘనత బీజేపీ పెద్దలదే అంటున్నారు.

నిజానికి చూస్తే సీఎం రమేష్ విశాఖ ఎంపీ సీటు కోరుకున్నారు. ఆయన గత కొంతకాలంగా విశాఖకు వచ్చి పోతూ ఉన్నారు. విశాఖ కాస్మో పాలిటిన్ కల్చర్ తో ఉంటుంది. పైగా ఎంతో మంది వివిధ జిల్లాలకు చెందిన వారు అక్కడకు వచ్చి ఎంపీలు అయ్యారు. కాబట్టి తాను కూడా గెలవవచ్చు అని ఆయన భావించారు.

అంతే కాదు విశాఖ ఎంపీగా గెలవడం అంటే ఒక ప్రతిష్టగా కూడా అంతా అనుకుంటారు. సీఎం రమేష్ అలాగే విశాఖ మీద మోజు పడ్డారు. పొత్తులలో ఎపుడూ విశాఖ సీటు బీజేపీకే ఇస్తారు. ఆ విధంగా చూస్తే బీజేపీకి ఈ సీటు దక్కుతుందని భావించే చాలా కాలం ముందు నుంచే రమేష్ అక్కడ కర్చీఫ్ వేశారు. ఎటూ టీడీపీకి పూర్వ మిత్రుడు చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి రమేష్ కి విశాఖ సీటు ఖాయమని కూడా అంతా అనుకున్నారు

కానీ టీడీపీ రాజకీయంతో విశాఖ సీటు బీజేపీకి కాకుండా పోయింది. బీజేపీ జాతీయ పెద్దలు ఎంత వత్తిడి చేసినా విశాఖ ఎంపీ సీటు ఇచ్చేందుకు బాబు ససేమిరా అన్నట్లుగా ప్రచారం సాగింది. దానికి బదులుగా అనకాపల్లి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించింది. దాంతో ఇష్టం లేకపోయినా బీజేపీ తీసుకుంది. అయితే ఆ సీటులో అప్పటికే విశాఖ మీద ఆశలు పెంచుకున్న సీఎం రమేష్ ని పోటీకి దింపాలనుకోవడమే ఒక రాంగ్ డెసిషన్ అంటున్నారు.

అనకాపల్లి పార్లమెంట్ లో రాజకీయ చరిత్ర గెలుపు గుర్రాలు తీసుకుంటే వారు ఎపుడూ లోకల్స్ గానే ఉంటూ వచ్చారు. అనకాపల్లి మీద ఆశపడి ఎవరైనా వచ్చినా వారికి ఓటమి వరించిన సంగతీ చరిత్రలో భద్రంగా ఉంది. ఇవన్నీ తెలిసి కూడా రమేష్ ని పంపించారు. ఇక కూటమి కష్టాలు లెక్కలేనన్ని అని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం చూస్తేనే అర్ధం అవుతుంది.

మాజీ మంత్రులు అలగడం, కొందరు సీట్లు లేక మౌనం దాల్చడం, జనసేన బీజేపీ టీడీపీల మధ్య సయోధ్య లేకపోవడం అసంతృప్తులు ఇలా చాలా ఉన్నాయి. దాంతో రమేష్ ముందుగా టీడీపీ పెద్దలను కలుసుకుని వారిని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

ఎన్ని చేసినా గ్రౌండ్ లెవెల్ లో లోకల్ కార్డు తో వైసీపీ వస్తోంది. బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుని ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. బూడి వివాదరహితుడు, మోడల్ నియోజకవర్గంగా మాడుగులను అభివృద్ధి చేశారు. అజాత శతౄవుగా ఆయన ఉంటారు. అందరికీ అందుబాటులో ఉండే నేత. దాంతో ఆయన అభ్యర్ధిత్వం పట్ల మొగ్గు కనిపిస్తోంది.

ఈ పరిణామాల నేపధ్యంలో కూటమిలో కూడా కొంత చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే నర్సాపురం ఎంపీ సీటు విషయంలో బీజేపీ అధినాయకత్వం టీడీపీల మధ్య మార్పు చేర్పులు సాగుతున్నాయని అంటున్నారు. దాంతో పనిలో పనిగా అనకాపల్లి సీటుకు బదులు విశాఖ సీటుని తీసుకోవాలని సీఎం రమేష్ పార్టీ పెద్దల వద్ద వినతి చేసుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది.

ఈ విషయాన్ని ఎలమంచిలి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజు మీడియా ముఖంగా ప్రకటించి సంచలనం రేపారు. సీఎం రమేష్ అనకాపల్లి సీటు వద్దు అని పార్టీ పెద్దల వద్ద చెబుతున్నారు అని ఆయన అంటున్నారు. దాంతో అది నిజమేనా కాదా అన్న చర్చకు తెర లేచింది. మొత్తం మీద చూస్తే సీఎం రమేష్ విశాఖ మీద మళ్లీ మనసు పడుతున్నారు అని అంటున్నారు.

చంద్రబాబు కూడా నర్సాపురం సీటుని తీసుకుని రఘురామ క్రిష్ణం రాజు చేత పోటీ చేయించాలని చూస్తున్నారు. దాంతో విశాఖ సీటుని టీడీపీ వదులుకుని బీజేపీకి ఇవ్వాలని ఆ పార్టీ కోరుతోందని అంటున్నారు. విశాఖ బీజేపీ శాఖ కూడా విశాఖ సీటు మీద పట్టుబడుతోంది. ఈ మేరకు జేపీ నడ్డాకు ఒక తీర్మానాన్ని చేసి పంపించింది. దీంతో సీఎం రమేష్ కూడా అలా కోరి ఉంటారని అంటున్నారు. మరి బీజేపీ టీడీపీ అంగీకరిస్తే విశాఖ సీటు బీజేపీకి రావచ్చు. విశాఖ సీటు బీజేపీకి ఇస్తే జీవీఎల్ నరసింహారావు ఆ సీటు కోరుకుంటున్నారు. మరి సీఎం రమేష్ కే ఆ సీటు ఇస్తారా లేక అభ్యర్ధి మార్పు కూడా ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది.