Begin typing your search above and press return to search.

'కుప్పం ఎమ్మెల్యేకి చాలెంజ్' మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ మాటల మంటలు

సభా నాయకుడిని పట్టుకుని ఎమ్మెల్యే అంటారా? అంటూ మంత్రులు, కూటమి ఎమ్మెల్సీలు నిలదీశారు. ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

By:  Tupaki Desk   |   25 Sept 2025 6:09 PM IST
కుప్పం ఎమ్మెల్యేకి చాలెంజ్ మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ మాటల మంటలు
X

శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ వ్యాఖ్యలు అగ్గి పుట్టించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యేగా ఆయన సంబోధించడంపై మంత్రులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సూపర్ సిక్స్ హామీలపై చర్చ సందర్భంగా చోటుచేసుకున్న ఈ వివాదం సభ లోపల, బయట తీవ్ర చర్చకు తెరలేపింది. సభలో తీవ్ర గందరగోళానికి దారితీయగా చైర్మన్ మోషేన్ రాజు పరిస్థితిని చక్కదిద్దడానికి సభను వాయిదా వేశారు.

సూపర్ సిక్స్ పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రమేశ్ యాదవ్ వ్యాఖ్యలతో రచ్చ రేగింది. గత ప్రభుత్వంలో తమ పార్టీ అధినేత జగన్ ఒక్క సంతకంతో 1.35 లక్షల ఉద్యోగాలిచ్చారని చెప్పిన రమేశ్ యాదవ్.. ప్రస్తుత ప్రభుత్వంలో 15 వేల ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆక్షేపించారు. ఇదే సమయంలో కుప్పం ఎమ్మెల్యే అయినా ఇంకెవరైనా చాలెంజ్ చర్చిద్దామా? అంటూ సవాల్ విసిరారు. దీనిపై మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

సభా నాయకుడిని పట్టుకుని ఎమ్మెల్యే అంటారా? అంటూ మంత్రులు, కూటమి ఎమ్మెల్సీలు నిలదీశారు. ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ వ్యాఖ్యలను సమర్థించడం మరింత దుమారానికి దారితీసింది. ముఖ్యమంత్రిని ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అనలేదని, గత ప్రభుత్వంలో ఉన్న అప్పటి కుప్పం ఎమ్మెల్యే అన్నారని ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ ను వెనకేసుకువచ్చారు బొత్స. అయితే అధికారపక్షం ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతోపాటు రమేశ్ యాదవ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టింది.

దీంతో సభను కొద్దిసేపు వాయిదా వేసిన మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరిగి సమావేశమైన అనంతరం మాట్లాడుతూ, సభలో పరిణామాలు, సభా సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. జరిగిన పరిణామాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. సభ్యుడు రమేశ్ యాదవ్ మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. పెద్దల సభలో హుందాగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

కాగా, సభ వెలుపల కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. సభలో గందరగోళ పరిస్థితుల తర్వాత కొద్దిసేపు వాయిదా పడగా, ఆ సమయంలో మండలి సభ్యుల మధ్య పిచ్చాపాటి మాటలు చోటుచేసుకున్నాయి. వైసీపీ సభ్యులు చర్చల్లో మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే అంటూ కూటమి నేతలు పిలుస్తున్నందున తాము కూడా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్ ను ఎమ్మెల్యేగా సంభోదించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జగన్మోహనరెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేగా పిలిచినంత వరకు కుప్పం ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే అంటూ ఉంటామని స్పష్టం చేశారు.