Begin typing your search above and press return to search.

అమరావతి రైతులకు సెల్యూట్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భావోద్వేగం

రాజధాని అమరావతి బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహననాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

By:  Tupaki Political Desk   |   2 April 2026 3:41 PM IST
అమరావతి రైతులకు సెల్యూట్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భావోద్వేగం
X

రాజధాని అమరావతి బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహననాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, మహిళలకు పార్లమెంటు సాక్షిగా సెల్యూట్ చేస్తున్నానని ప్రకటించారు. 29 వేల మంది రైతులు విశాల హృదయంతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేశారని రామ్మోహన్ నాయుడు కొనియాడారు. బుధవారం లోక్ సభ ఆమోదించిన అమరావతి బిల్లును రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టారు.

రాజ్యసభలో అమరావతిపై ప్రవేశపెట్టిన బిల్లుపై ఆసక్తికర చర్చ కొనసాగింది. వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు బిల్లును సమర్థించాయి. జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ సైతం చర్చలో పాలుపంచుకున్నాయి. కేంద్రం తరఫున టీడీపీకి చెందిన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. రాజధాని అమరావతి కోసం భూములను త్యాగం చేసి, ఎన్నో ఏళ్లుగా సాగిన పోరాటంలో దృఢంగా నిలబడిన రైతులు, మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతి బిల్లును తెలుగు ప్రజలంతా గర్వంగా భావిస్తున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందని.. ఈ రోజు ఆ లోటు భర్తీ అయిందని ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ విభజన జరిగిన తీరుకు తాము వ్యతిరేకమని.. రాజధాని బిల్లు ఎందుకు తెచ్చారనేది అందరూ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మాజీ ప్రధాని వాజపేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన జరిగిందని, ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులూ రాలేదన్నారు. ఏపీ విభజన సమయంలో రాజధాని లేకుండా వదిలేయడంతోనే సమస్య మొదలైందన్నారు. ఆ సమయంలో రాష్ట్రానికి రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని చెప్పుకొచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఏపీలో చీకటి రోజులు రాజ్యమేలాయని కేంద్రమంత్రి విమర్శించారు.

మూడు రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించారని, రాజధాని కోసం ఉద్యమించిన రైతులను తీవ్రంగా హింసించారని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, గర్బిణులపైనా పోలీసులతో లాఠీ చార్జి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నది తీరంలో అమరావతి నిర్మించాలనేది ఏపీ ప్రభుత్వ నిర్ణయమని, ఐకానిక్, వరల్డ్ క్లాస్ రాజధానిగా నిర్మాణం జరుగుతోందని కేంద్ర మంత్రి రాజ్యసభలో వివరించారు. ఇక ఈ చారిత్రక చర్చను టీడీపీ యువనేత, మంత్రి లోకేశ్ రాజ్యసభ గ్యాలరీ నుంచి వీక్షించారు. ఆయనతోపాటు టీడీపీకి చెందిన లోక్ సభ సభ్యులు అంతా గ్యాలరీలో కూర్చుని చర్చను చూశారు.