రాజాం.. రాజకీయం హాట్ హాట్!
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయా? కూటమి లోనే వివాదాలు రోడ్డున పడుతున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
By: Garuda Media | 25 May 2026 5:00 AM ISTఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయా? కూటమి లోనే వివాదాలు రోడ్డున పడుతున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజాం ఎస్సి నియోజకవర్గం అయినప్పటికీ.. బలమైన సామాజిక వర్గాల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు ఇక్కడ విజయం దక్కించుకున్నా.. అభివృద్ధివిషయంలో పైచేయి సాధించలేక పోతున్నారు.
ప్రస్తుతం టీడీపీ తరఫున కోండ్రు మురళీ మోహన్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఆయన.. మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది.అయితే.. ఇదే నియోజకవర్గంలో మరో ఇద్దరు నాయకులు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తు న్నారు. వీరిలో మహిళా నాయకురాలు కూడా ఉన్నారన్న చర్చ ఉంది. వాస్తవానికి ఈ పోటీని నివారించేం దుకు పార్టీ పరంగా అన్ని చర్యలు తీసుకున్నారు.
కానీ, పదవులు తీసుకున్న వారు కూడా.. వచ్చే ఎన్నికల్లో పోటీపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం గమనార్హం. దీంతో రెండు నుంచి మూడు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ఎమ్మెల్యే ఒక తీరుగా ఉంటే.. మరో ఇద్దరు కీలక నేతలు(వీరిలో ఒకరుమహిళ) చెరోదారిలో ఉన్నారు. వీరిలో ఒకరికి.. కేంద్ర మాజీ మంత్రి అండదండలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఫలితంగా నియోజకవర్గంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
చేస్తున్న అభివృద్ధిని చెప్పాలన్నా.. ఎవరికి వారుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ కూడా ఎవరికి వారే అన్నట్టుగా చేస్తున్నారు. ఫలితంగా ఇక్కడ రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఎవరికీ కలివిడి లేదు. ఎవరిలోనూ సఖ్యత లేదు. దీంతో రాజకీయాలు.. ప్రస్తుతం ఇబ్బందిగానే మారాయి. వాస్తవానికి అందరూ కలివిడిగా ఉండాలని చంద్రబాబు చెబుతున్నా.. ఆమేరకు రాజాంలో అయితే.. ఎక్కడా కనిపించకపోవడం.. టికెట్ పోరు పెరగడం గమనార్హం. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి.
