Begin typing your search above and press return to search.

నరసాపురం నుంచి రఘురామకు టిక్కెట్ కన్ఫామే కానీ...!!

టీడీపీ - బీజేపీ మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చినా, ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభమైనా

By:  Tupaki Desk   |   3 April 2024 12:18 PM GMT
నరసాపురం నుంచి రఘురామకు టిక్కెట్ కన్ఫామే కానీ...!!
X

టీడీపీ - బీజేపీ మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చినా, ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభమైనా.. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాట్లలోని కొన్ని సమస్యలు ఇంకా సజీవంగా ఉండటం కొత్త సమస్యగా మారుతుందనే అభిప్రాయాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా నరసాపురం లోక్ సభ టిక్కెట్ విషయంలో గతకొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లోనూ, అటు టీడీపీ క్యాడర్ లో కూడా జరుగుతున్న చర్చ టీడీపీ - బీజేపీల్లో కదలికలు తెచ్చిందని అంటున్నారు!

అవును... తనకు నరసాపురం లోక్ సభ టిక్కెట్ ఇవ్వకపోవడంపై మొదట్లో తీవ్ర ఆవేదన, తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపించిన రఘురామ.. రోజులు గడిచే కొద్దీ తన ఆశాభావాన్ని మాత్రమే వ్యక్తం చేస్తూ.. తాను ఆ టిక్కెట్ దక్కించుకోవడానికి ఎందుకు అర్హులో చెబుతూ మాట్లాడుతున్నారు. మరో 15 - 20 ఏళ్లు కంటిన్యూస్ గా జగనే పాలిస్తాడని ఆల్ మోస్ట్ ప్రతిపక్షాలు కూడా ఫిక్సయిన సమయంలో.. తాను ఓంటరిగా జగన్ పై పోరాటం మొదలుపెట్టినట్లు రఘురామ గుర్తుచేస్తున్నారు!

ఈ నేపథ్యంలో... నరసాపురం లోక్ సభ స్థానం టీడీపీ ఇవ్వడానికి బీజేపీ అంగీకరించిందని.. ఆ టిక్కెట్ రఘురామరాజుకే దక్కుతుదని తెలుస్తోంది! అయితే ఈ సమయంలో బీజేపీ రెండు మూడు మెళికలు పెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. నరసాపురం టిక్కెట్ త్యాగం చేయాల్సి వస్తే... అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస వర్మకు ఉండి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని బీజేపీ కోరుతుందని తెలుస్తుంది.

టీడీపీకి కంచుకోట అయిన ఆ టిక్కెట్ లో కూటమి గెలుపు కన్ ఫాం అని వారు భావిస్తున్నారని అంటున్నారు! అయితే ఇప్పటికే ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే! మరి ఈ విషయంపై బాబు ఎలాంటి నిర్ణయానికి వస్తారనేది ఆసక్తిగా మారింది! నిజంగా ఉండి టిక్కెట్ బీజేపీ ఇస్తే అయినా... మంతెన రామరాజు, వేటుకూరి శివరామరాజు లు ఏకతాటిపైకి వస్తారేమో చూడాలని అంటున్నారు!!

ఆ సంగతి అలా ఉంటే... కడప ఎంపీ సీటు విషయంలో కూడా బీజేపీ కొత్త కోరిక కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా జమ్మలమడుగు టిక్కెట్ తీసుకుని.. కడప లోక్ సభ స్థానం తమకు ఇవ్వాలని టిఈడీపీని బీజేపీ కోరుతుందని అంటున్నారు. వైఎస్ షర్మిళ కడప ఎంపీగా పోటీ చేస్తున వేళ.. వైసీపీ - కాంగ్రెస్ ల మధ్య ఓట్లు చీలి.. అది తమకు ప్లస్ అయ్యే అవకాశం ఉందని భావిస్తుందని అంటున్నారు!

మరోపక్క... అనపర్తి వ్యవహారం ఇప్పుడు కూటమిలో మరో కీలక సమస్యగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గాన్ని శాంతింప చేయడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అన్నీ బెడిసి కొట్టాయని అంటున్నారు! దీంతో... నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భార్యను బీజేపీలో చేర్చుకుని ఆమెకు అనపర్తి టిక్కెట్ ఇస్తే పరిస్థితి ఏమైనా సద్దుమణుగుతుందా అనే దిశగా కూడా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు!