Begin typing your search above and press return to search.

పదవి అంతా అయిపోయాక రాజీనామా ఏంటి రాజు గారూ...!?

నరసాపురానికి చెందిన వైసీపీ రెబెల్ ఎంపీ రాజు గారు సంక్రాంతి పండుగ వేళ ఒక మంచి మాట చెప్పారు.

By:  Tupaki Desk   |   13 Jan 2024 9:26 AM GMT
పదవి అంతా  అయిపోయాక రాజీనామా ఏంటి రాజు గారూ...!?
X

నరసాపురానికి చెందిన వైసీపీ రెబెల్ ఎంపీ రాజు గారు సంక్రాంతి పండుగ వేళ ఒక మంచి మాట చెప్పారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తాను అని. ఆయన గత నాలుగున్నరేళ్లుగా వైసీపీకి దూరంగానే ఉంటూ తిట్టని తిట్టు తిట్టకుండా కాలం గడుపుతున్నారు. ఆయన ఎంపీ అయిన తొలి ఆరు నెలల నుంచే వైసీపీతో వైరం వచ్చింది.

ఆ తరువాత నుంచి ఆయన రెబెల్ ఎంపీగానే ఉంటూ వచ్చారు. ఇక ఆయన మీద అనర్హత వేటు వేయాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలెదు. దాంతో రాజు గారి పదవి నిక్షేపంగా అయిదేళ్ళ పాటు సాగిపోయింది. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి తొమ్మిదవ తేదే వరకూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి.

ఈ సమావేశాలే ప్రస్తుత పార్లమెంట్ కి చివరివి. ఈ సమావేశాల తరువాత ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. మ్యాటర్ ఇంత క్లియర్ గా ఉంటే రాజు గారు తాను వైసీపీని రాజీనామా చేస్తాను అని ప్రకటించారు. అది కూడా ఫిబ్రవరిలో అని కూడా టైం ఫిక్స్ చేశారు. అంటే ఈ టెర్మ్ లో జరిగే చివరి పార్లమెంట్ సెషన్ లో కూడా ఆయన వైసీపీ ఎంపీగా హాజరై ఆ పదవీ కాలం అంతంలో రాజీనామా చేస్తారు అన్న మాట.

దానికి ఆయన వైసీపీ అధినాయకత్వం మీద సెటైర్లు కూడా వేశారు. అదేంటి అంటే నన్ను ఎంపీగా అనర్హుడిగా చేయడంతో ఆ పార్టీ పెద్దలు ఫెయిల్ అయ్యారు. అందువల్ల నేనే రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యాను అని. నిజంగా చూస్తే వైసీపీ అనర్హత పిటిషన్ ఇచ్చింది 2020లో. ఇప్పటికి మూడున్నరేళ్ళ క్రితం. దాని మీద ఏ యాక్షన్ లేదని తెలిసి కూడా ఏళ్ళు గడుస్తున్నాయి.

మరి నాడే వైసీపీ నన్ను అనర్హుడిగా చేయాలని చూస్తోంది. నేనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని రాజు గారు ప్రకటించవచ్చు కదా. జనాలు కూడా శభాష్ అంటారు కదా.కానీ వైసీపీ గిట్టదు అని తెల్లారి లేస్తూనే విమర్శిస్తూ ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిని మాత్రం అయిదేళ్ళూ రాజు గారు అనుభవించారు అన్న విమర్శలను వైసీపీ నేతలు చేస్తున్నారు

ఇపుడు ఎటూ లోక్ సభకు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజీనామా అంటూ గంభీరంగా ప్రకటించినా జనాలు మెచ్చుతారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏది ఏమైనా రాజు గారికే ఇలాంటి సంచలన ప్రకటనలు చేయడం చెల్లు అని అంటున్నారు. ఆయన వైసీపీ వారిని సవాల్ చేయగలరు. ప్రతి సవాల్ చేయగలరు అని సెటైర్లు పడుతున్నాయి.

ఇక్కడ వైసీపీ అధినాయకత్వం వైపూ తప్పు ఉందని అంటున్న వారూ ఉన్నారు. రెబెల్ ఎంపీ పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ రచ్చ చేస్తూంటే ఆయనను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించలేకపోయారు అన్నది ఎవరికీ అర్ధం కాని విషయమే.

పార్టీ మారుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడుతున్న వైసీపీ హై కమాండ్ రాజు గారి విషయంలో మాత్రం ఉదారంగా ఉండడం కూడా రాజకీయ విడ్డూరంగా చూస్తున్న వారూ ఉన్నారు. మొత్తానికి ఒక్క విషయం క్లారిటీ అయితే వచ్చేసింది. రాజు గారు ఫిబ్రవరి నుంచి వైసీపీ రెబెల్ ఎంపీ కారు. ఆయనకూ వైసీపీకి సంబంధంలేదు. ఇక పైన ఉండదు. ఇది పక్కాగా తేలుతున్న నిజం.