Begin typing your search above and press return to search.

జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్ధిగా వైసీపీ ఎంపీ ఖరారు !

టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా ఎంపీగా తాను మరోమారు బరిలో నిలవబోతున్నాను అని ఆయన స్పష్టం చేశారు

By:  Tupaki Desk   |   8 Nov 2023 3:37 PM GMT
జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్ధిగా వైసీపీ ఎంపీ ఖరారు  !
X

ఎంపీగా ఎన్నిక అయిన ఆరు నెలల వ్యవధిలోనే అధినాయకత్వంతో విభేదాలు పెంచుకుని రెబెల్ రాజుగా పేరు పొందిన నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఉరఫ్ ట్రిపుల్ ఆర్ 2024 ఎన్నికలకు తాను పోటీ చేసేది ఎక్కడో చెప్పేశారు. నర్సాపురం నుంచి మరోమారు తానే పోటీకి దిగుతాను అని ఆయన అంటున్నారు.

టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా ఎంపీగా తాను మరోమారు బరిలో నిలవబోతున్నాను అని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు. తాను ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా రంగంలోకి దిగి భారీ మెజారిటీతో గెలుస్తాని అని ధీమాగా చెప్పారు.

ఇంత క్లారిటీగా రాజు గారు చెప్పేశాక ఆయనే నర్సాపురం ఎంపీ అని ఒప్పుకుని తీరాల్సిందే. అయితే రాజు గారు టీడీపీ టికెట్ నుంచి పోటీ చేసి జనసేన పొత్తు ద్వారా గెలుస్తారా లేక జనసేన టికెట్ మీద పోటీ చేసి టీడీపీ పొత్తుతో దూకుడు చేస్తారా అన్నది మాత్రం చెప్పలేదు.

అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే కనుక జనసేనకే నర్సాపురం లోక్ సభ సీటుని టీడీపీ ఇవ్వనుంది అని అంటున్నారు. నర్సాపురంలో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అభ్యర్ధులు ఉన్నా కూడా మిత్రపక్షం ధర్మంగా ఈ సీటుని ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే జనసేన నుంచి రఘురామ క్రిష్ణం రాజు పోటీ చేస్తారా అన్నదే చూడాలి. ఎందుకంటే జనసేనలో నాగబాబు ఉన్నారు. ఆయనకు 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తేనే రెండున్నర లక్షల ఓట్లకు పైగా వచ్చాయి. ఇక నాగబాబుని పార్లమెంట్ కి పంపించాలని పవన్ కళ్యాణ్ కి ఉందని అంటున్నారు.

తాను ఏపీ రాజకీయాల్లో ఉంటూ తన సోదరుడుని ఢిల్లీ రాజకీయాలలో కేంద్ర బిందువుగా చేయాలని అలా అయితే పార్టీ పటిష్టంగా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు చూస్తే నాగబాబుని ఈసారి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీకి జనసేన తరఫున దించుతారు అని అంటున్నారు.

అదే జరిగితే మాత్రం నర్సాపురం టికెట్ రఘురామ క్రిష్ణం రాజుకు కన్ ఫర్మ్ చేయవచ్చు. అయితే ఈ రోజుకీ రెబెల్ రాజు వైసీపీ మెంబర్ గానే టెక్నికల్ గా ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి వేరు పడలేదు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే ఆయన వైసీపీకి రాజీనామా చేసి తనకు నచ్చిన పార్టీలో చేరుతారు అని అంటున్నారు

ఇక రాజు గారు తీరు చూస్తే ఆయన చంద్రబాబుకు ఇటు పవన్ కళ్యాణ్ కి కూడా సన్నిహితులే అన్నది తెలిసిందే. ఢిల్లీకి వేరు వచ్చినప్పుడల్లా కలుస్తూ వారితో మంచి రిలేషన్స్ కొనసాగిస్తున్నారు. వైసీపీ మీద తొలి నుంచి పోరాడుతున్న రాజుకు టీడీపీ జనసేన మద్దతు ఉంది అని అంటారు. అందువల్ల మరోసారి ఆయన ఎంపీగా పోటీ చేయడానికి రెండు పార్టీలకు అభ్యంతరం ఉండబోదు అని అంటున్నారు.

ఇక నర్సాపురం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి తణుకు, తాడేపల్లిగూడెం ఈ పార్లమెంట్ పరిధిలోని వస్తాయి. ఇక్కడ చూస్తే భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం లలో జనసేనకు మంచి పట్టు ఉంది.

అలాగే తణుకు, ఆచంట, పాలకొల్లు, ఉండిలలో టీడీపీకి బలం ఎక్కువగా ఉంది. దాంతో నర్సాపురం, ఎంపీ సీటుకు అంగబలం అర్ధబలం ఉన్న వారు దొరికితే మొత్తం అసెంబ్లీ సీట్లను గెలుచుకోవచ్చు అన్నది టీడీపీ జనసేన వ్యూహంగా ఉంది అని అంటున్నారు రెబెల్ రాజు అన్ని విధాలుగా తగిన వారే అంటున్నారు. అలా రాజు గారికి సీటు క్లియర్ అయినట్లుగానే భావిస్తున్నారు.