Begin typing your search above and press return to search.

రఘురామకు ఢిల్లీ ఎంతెంత దూరం ?

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ క్రిష్ణం రాజు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

By:  Satya P   |   6 April 2026 4:00 AM IST
రఘురామకు ఢిల్లీ ఎంతెంత దూరం ?
X

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ క్రిష్ణం రాజు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నిజానికి ఎపుడూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకోలేదు. ఆయన ఢిల్లీ రాజకీయాలనే ఇష్టపడతారు. దాని కోసం ఆయన ఎంపీగానే పోటీకి సిద్ధపడుతూ వచ్చారు. 2009 ఎన్నికల నుంచి ఆయన ప్రయత్నం చేస్తే అది కాస్తా 2019లో వైసీపీ రూపంలో కల సాకారం అయింది. 2009లో కాంగ్రెస్ లో ఉన్న రఘురామకు వైఎస్సార్ క్లోజ్ అయినా ఆయన కోరుకున్న నరసరావుపేట లోక్ సభ సీటు దక్కలేదు. ఇక 2014 నాటికి టీడీపీలో చేరారు, సీటు కన్ఫర్మ్ అనుకున్నారు కానీ బీజేపీ పొత్తులో భాగంగా ఆ సీటుని అందుకుంది. ఇక 2024లో అదే సీన్ రిపీట్ అయింది ఈసారి కూడా బీజేపీకే పొత్తులో భాగంగా ఈ సీటు ఇచ్చేశారు.

బీజేపీతోనూ దోస్తీ :

అయిదేళ్ల పాటు ఎంపీగా ఉన్న రఘురామకు కేంద్ర స్థాయిలో బీజేపీ నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన తొలిసారి ఎంపీ అయినా ఆయనకు పార్లమెంటరీ లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ గా కీలకమైన పదవిని ఇచ్చారు. అది బీజేపీ పెద్దలతో ఉన్న అనుబంధం వల్లనే సాధ్యమైంది అని అంటారు. ఈ క్రమంలో 2024 ఎన్నికల ముందు మూడు పార్టీలు అంటే బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ తనకు ఎంపీ సీటు ఇస్తాయని పొత్తులు ఉన్నా తానే ఎంపీ అని ఆయన భావించారు. అయితే అది సాధ్యపడలేదు. బీజేపీ శ్రీనివాస వర్మకు నరసారావుపేట ఎంపీ సీటు ఇచ్చింది. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు.

మనసులో మాట ఇదే :

ఇదిలా ఉంటే తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో రఘురామ క్రిష్ణం రాజు తన మనసులో మాటను బయటపెట్టారు. తనకు ఢిల్లీ రాజకీయాలే ఇష్టమని చెప్పారు. తాను అయిదేళ్ల పాటు ఎంపీగా పనిచేశాను అని గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలన్న తన మనోగతాన్ని బయటపెట్టారు కూడా. అయితే 2029 ఎన్నికల్లో ఆయనకు ఎంపీ సీటు దక్కే అవకాశాలు ఎంతవరకూ అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే నరసరావుపేట నుంచి సిట్టింగ్ ఎంపీగా బీజేపీకి చెందిన శ్రీనివాస వర్మ ఉన్నారు.

బీజేపీ సీటుగా :

ఏపీలో టీడీపీ బీజేపీలకు ఎపుడు పొత్తు కుదిరినా కూడా నరసారావుపేట సీటుని కమలం పార్టీ కోరుకుంటుంది ఇది చాలా దశాబ్దాలుగా అమలులో ఉన్న ఒప్పందం. ఇక 1998లో ఈ సీటు నుంచి సొంతంగా బీజేపీ గెలిచిన అనుభవం ఉంది. దాంతో ఈ సీటు తమకు హాట్ ఫేవరేట్ గా భావిస్తుంది. ఇక కూటమి పార్టీలు కలసి పోటీ చేస్తాయి అనుకుంటున్న నేపధ్యంలో 2029 లో కూడా ఈ సీటు బీజేపీకే అని అంటున్నారు. అలాగైతే రఘురామకు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఎంతవరకూ అన్నదే పెద్ద ప్రశ్న. ఆయన బీజేపీలోకి చేరినా సీటు దక్కుతుందా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే ప్రయారిటీ ఇస్తోంది ఒక వేళ ఈ సీటు కాకపోతే కాకినాడ లోక్ సభ స్థానం వైపు ఆయన చూపు ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ఈ సీటు జనసేనకు కన్ఫర్మ్ అని అంటున్నారు. దాంతో పాటు అక్కడ బలమైన సామాజిక వర్గానికే సీటు దక్కుతుంది. సో నరసారావుపేట సీటు మాత్రమే రఘురామకు అనుకూలం. ఈ నేపధ్యంలో ఆయనకు బీజేపీ పెద్దల సాన్నిహిత్యం పూర్తిగా ఉపయోగపడితేనే తప్ప ఎంపీ సీటుకు పోటీ చేయలేరు అన్నది విశ్లేషణగా ఉంది.