రఘురామతోనే టార్చర్.. ఐపీఎస్ సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
రఘురామపై కస్టోడియల్ టార్చర్ కేసుతోపాటు అగ్రిగోల్డ్ అవినీతి, నిబంధనలను అతిక్రమించి విదేశాలలో పర్యటనలు వంటి ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
By: Tupaki Political Desk | 25 Feb 2026 1:54 PM ISTడిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై సీనియర్ ఐపీఎస్ అధికారి పీ.వీ.సునీల్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై వ్యక్తిగత కక్ష తీర్చుకోవాలని, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని పీవీ సునీల్ కుమార్ విమర్శించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డిప్యూటీ స్పీకర్ పై సునీల్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీబీఐ దర్యాప్తునకు రఘురామరాజు పెట్టిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పై ఒత్తిడి తీసుకువచ్చి తన పేరు ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. సునీల్ కుమార్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆయన మాట్లాడిన వీడియోను వైసీపీ సోషల్ మీడియా విభాగం వైరల్ చేస్తోంది.
ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసు హాట్ టాపిక్ గా మారింది. బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించడం, ఆయనను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అక్కడి కోర్టు అనుమతించకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారని, ఎస్టీ కులానికి చెందిన వాడిననే ఆలోచనతో ఇబ్బంది పెడుతున్నారని సునీల్ నాయక్ ఆరోపించి సంచలనం రేపారు. దీనికి కొనసాగింపుగా సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సైతం అవే తరహా ఆరోపణలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.
రఘురామపై కస్టోడియల్ టార్చర్ కేసుతోపాటు అగ్రిగోల్డ్ అవినీతి, నిబంధనలను అతిక్రమించి విదేశాలలో పర్యటనలు వంటి ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనపై పెండింగులో ఉన్న కేసుల విచారణ పూర్తయ్యేవరకు లేదంటే ఉద్యోగ విరమణ చేసేంతవరకు సస్పెన్షన్ ను పొడిగిస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. రఘురామరాజు కేసు ఎఫెక్ట్ తోనే సునీల్ కుమార్ సస్పెన్షన్ జరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక సర్వీసులో ఉండగా, ఆయన మళ్లీ యూనిఫాం వేసుకునే పరిస్థితి లేకపోవడంతో పీ.వీ.సునీల్ కుమార్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని చెబుతున్నారు. దీంతో ఓ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొంటున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై తీవ్ర విమర్శలు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారికిలోకి వచ్చిన నుంచి తనను ఇబ్బంది పెడుతున్నారని సునీల్ కుమార్ ఆరోపించారు. కస్టోడియల్ టార్చర్ అంటూ రఘురామరాజు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ఫిర్యాదుపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే, సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం రాగానే తనపై కేసు పెట్టారని, ఫిర్యాదు చేసిన నెల రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ వేశారని సునీల్ కుమార్ తెలిపారు. ఫిర్యాదులో బలం లేకపోవడంతో తనను ఇబ్బంది పెట్టడం కుదరదు అని, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లానని మరో తప్పుడు కేసు పెట్టారని సునీల్ కుమార్ ఆరోపించారు.
తాను అనుమతి తీసుకునే విదేశాలకు వెళ్లాలని, అక్కడకు వెళ్లిన తర్వాత షెడ్యూల్ లో మార్పులు జరిగాయని వెల్లడించారు. అగ్రకులాలకు చెందిన అధికారులు అనుమతులు లేకుండా విదేశాలకు వెళితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ పై కస్టోడియల్ టార్చర్ జరగలేదని మెడికల్ రిపోర్టులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తప్పుడు సాక్ష్యాల కోసం రఘురామ ప్రయత్నిస్తున్నారని, బిహార్ కేడర్ ఐజీ సునీల్ నాయక్ కు ఫోన్ చేసి తన పేరు చెప్పాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. రఘురామ డిప్యూటీ స్పీకర్ గా ఉండటం వల్ల సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు.
