Begin typing your search above and press return to search.

పురంధేశ్వరిని కేంద్ర మంత్రి...ఈ ప్రచారం హిట్టేనా...!?

బాబు మంత్రివర్గంలో ఒకరిద్దరు మంత్రులు ఉంటే బీజేపీ నుంచి ఉండొచ్చు.

By:  Tupaki Desk   |   8 April 2024 2:30 AM GMT
పురంధేశ్వరిని కేంద్ర మంత్రి...ఈ ప్రచారం హిట్టేనా...!?
X

బీజేపీ కొత్త ప్రచారం మొదలెట్టింది. తమ పార్టీకి చెందిన ఎంపీలను గెలిపించుకునేందుకు జనాలలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఎటూ కుదరదు. కూటమి గెలిస్తే టీడీపీ నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. బాబు మంత్రివర్గంలో ఒకరిద్దరు మంత్రులు ఉంటే బీజేపీ నుంచి ఉండొచ్చు.

అదే కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. అందుకే ఏపీలో ఎంపీల విషయంలో ప్రచారం చేస్తూ మోడీ ప్రభుత్వంలో ఫలానా వారు కేంద్ర మంత్రి అవుతారు అని హింట్ ఇస్తోంది. ఆ విధంగా జనాలలో రెట్టింపు ఆశలను పెంచి గెలవాలని అనుకుంటోంది.

ఏపీలో బీజేపీకి పొత్తులో భాగంగా ఆరు ఎంపీ సీట్లు దక్కాయి. ఇందులో ఇద్దరు సీనియర్లు ఉన్నారు. వారే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి. ఈ ఇద్దరూ ఏపీలో ప్రభావితం చేసే సామాజిక వర్గాలకు చెందిన వారు. అంతే కాదు ఈ ఇద్దరూ రెండు భిన్న ప్రాంతాల నుంచి పోటీ చేస్తున్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ఇద్దరూ ఏపీ నుంచి ఎంపీలుగా గెలిస్తే కేంద్ర మంత్రులు అవుతారు అన్న ప్రచారం అయితే ఉంది. దానికి మరింత బలాన్ని చేకూరుస్తూ ఆంధ్రప్రదేశ్ పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ ఒక కొత్త మాట చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆయన సంచలన కామెంట్స్ చేశారు.

ఆయన రాజమహేంద్రవరంలో బీజేపీ ఆఫీసుని ప్రారంభించిన నేపధ్యంలో మాట్లాడుతూ ఈ కీలకమైన కామెంట్స్ చేశారు. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. అయితే రాజమహేంద్రవరం ఓటర్లు పురంధేశ్వరికి ఓటు వేసే సమయంలో కేవలం ఎంపీకే కాకుండా మోదీ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సిద్దార్థనాథ్‌ సింగ్‌ అనడం విశేషం.

అంటే రాజమహేంద్రవరం ఓటర్లకు బంపర్ ఆఫర్ ఇది అని ఆయన చెబుతున్నారు అన్న మాట. ఒకే ఓటుతో ఏకంగా కేంద్ర మంత్రినే తన ప్రాంతానికి తెచ్చుకుంటారు అన్నది బీజేపీ ఇంచార్జి మాటగా ఉంది. ఈ నినాదం జనంలోకి బలంగా వెళ్తే వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని అంటున్నారు

అదెలా అంటే వైసీపీ ఎంపీని గెలిపిస్తే ఆయన ప్రతిపక్షంలోనే ఉంటారు. రాజమహేంద్రవరం ప్రజల సమస్యలు తీర్చలేరు. అదే బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర క్యాబినెట్ లో చేరి తామున్న ప్రాంతానికి మేలు చేయడం జరుగుతుందని అంటున్నారు.

అందుకే పురంధేశ్వరిని గెలిపించుకోవడం ఎంత అవసరం అన్నది బీజేపీ నేతలు ఈ విధంగా చెబుతున్నారు అన్న మాట. ఇదిలా ఉంటే రాజమహేంద్రవరం ఓటర్లు తన తండ్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు మద్దతిచ్చినట్లే తమను ఆదరిస్తారని పురంధేశ్వరి ఆకాంక్షించారు. మొత్తానికి పురంధేశ్వరి కేవలం ఎంపీ కాదు అన్న మాట. ఆమె కేంద్ర మంత్రి అన్న మాట. సో కోస్తాలో ఆమె బీజేపీ మంత్రివర్గంలో బెర్త్ ఎన్నికల ముందే సంపాదిచేశారు అనుకోవాలి. మరి ఓటర్లు ఆమెను ఎంపీగా గెలిపిస్తారా అన్నదే ఇక్కడ కీలకమైన పాయింట్.