‘దత్తత తీసుకున్న అమెరికా దంపతులు చిత్రహింసలు పెడుతున్నారు’
ఒడిశా రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల వయసున్న యువతి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిన వీడియో సందేశం ఇప్పుడు సంచలనంగా మారింది.
By: Garuda Media | 11 Nov 2025 11:17 AM ISTఒడిశా రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల వయసున్న యువతి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిన వీడియో సందేశం ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికాలో ఉన్న తనను.. అక్కడి దంపతులు తనను తీవ్ర చిత్రహింసలకు పెడుతున్నట్లుగా ఒడిశాకు చెందిన 21 ఏళ్ల పూజ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తనను ఆదుకోవాలంటూ ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాఝిను ఆమె వేడుకుంటున్నారు. ఇంతకు ఆ వీడియో సందేశంలో ఏముందంటే?
ఒడిశాకు చెందిన పూజ బాల్యంలో రైలు ప్రయాణంలో తప్పిపోయింది. దీంతో ఆమెను కాపాడిన రైల్వే సిబ్బంది నీలగిరి బాలికల కేంద్రానికి అప్పగించారు. అక్కడ నుంచి ఆమెను తర్వాతి కాలంలో భువనేశ్వర్ లోని సహర్ కాంత్ చిన్నారుల హోంకు తరలించారు. అక్కడే ఉంటూ చదువుకున్నారు. ఈ క్రమంలో 2018లో అమెరికాకు చెందిన దంపతులు ఆమెను దత్తత తీసుకున్నారు. పూజ అలియాస్ సీజెల్ వారిలో కలిసి అమెరికాకు వెళ్లిపోయారు.
ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న పూజ.. తనను దత్తత తీసుకున్న అమెరికన్ దంపతులు ఎంతలా హింసలు పెడుతున్నారన్న విషయాన్ని వివరిస్తూ ఒక వీడియోను పోస్టు చేశారు. స్కూల్ నుంచి రాగానే చాలా ఎక్కువగా ఇంటి పని చేయిస్తున్నారన్న ఆమె.. తాను భువనేశ్వర్ లో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేదానిని పేర్కొన్నారు. స్కూల్ కు సెలవులు ఇచ్చినప్పుడు.. బయటకు పనికి వెళ్లి సంపాదించేదానినని పేర్కొన్నారు.
తన పాస్ పోర్టు కాలపరిమితి 2023 నాటికి ముగిసినా ఇప్పటివరకు రెన్యువల్ చేయలేదని.. తాను సొంతంగా సంపాదించుకున్న పది లక్షల రూపాయిల్ని బలవంతంగా తన పెంపుడు తల్లి లాగేసుకున్నట్లు ఆమె వాపోయారు. అంతేకాదు.. ఇప్పటివరకు రెండుసార్లు తనపై హత్యాయత్నం జరిగిందని.. హిందూ మతానికి చెందిన తనను మతం మారాలని బలవంతంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనను ఒడిశా ముఖ్యమంత్రి కాపాడి.. భువనేశ్వర్ కు తిరిగి వచ్చేలా సాయం చేయాలని కోరారు. మరి.. ఒడిశా ముఖ్యమంత్రి ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.
