Begin typing your search above and press return to search.

మూడు నెలలు వంద కోట్లు : టీడీపీని పీకే ఏం చేస్తాడో...!?

టైం చూస్తే చాలా తక్కువగా ఉంది. కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భం ఉంది. కొత్త ఏడాదిలో పండుగలు హడావుడి ఎక్కువ

By:  Tupaki Desk   |   25 Dec 2023 4:00 AM GMT
మూడు నెలలు వంద కోట్లు :  టీడీపీని పీకే ఏం చేస్తాడో...!?
X

టైం చూస్తే చాలా తక్కువగా ఉంది. కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భం ఉంది. కొత్త ఏడాదిలో పండుగలు హడావుడి ఎక్కువ. అది ముగిస్తే ఫిబ్రవరి చిన్న నెల. అంతే మార్చి రావడంతోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అపుడు ఇక బిజీ అన్న మాటకే కొత్త అర్ధాలు వెతుక్కోవాలి.

అలాంటి టఫ్ టైం లో ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే టీడీపీ వ్యూహకర్తగా కీలక బాధ్యతలు స్వీకరించబోతున్నారు అని అంటున్నారు. ఇక టీడీపీకి ఎన్నికల వ్యూహాలు ఇచ్చి రేపటి రోజున అధికారంలోకి తీసుకుని రావడానికి పీకేతో టీడీపీ కుదుర్చుకున్న డీల్ అచ్చంగా వంద కోట్లు అని ప్రచారం అయితే సాగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఒక పెద్ద మొత్తం లేకపోతే పీకే వంటి స్టార్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఒక రాజకీయ పార్టీ వైపు రాడు అనే అంటారు.

అంతే కాదు పీకేకి ఇది వెరీ టఫ్ జాబ్ కూడా. ఎందుకంటే ఆయన వైసీపీ వైపు ఉండి అధికారంలోకి తేవడానికి పన్నిన వ్యూహాలకు రివర్స్ గేర్ వేస్తూ పోవాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తాను పవర్ లోకి తెచ్చాను అని చెప్పుకుంటున్న వైసీపీని తానే కూల్చాలన్న మాట. అది చాలా కష్టతరమైన జాబ్.

ఇక వైసీపీకి పన్నిన వ్యూహాలు టీడీపీకి సరిపోవు. అంతే కాదు బాబు సీనియర్ మోస్ట్ నేత. మూడు సార్లు సీఎం గా పనిచేసిన నాయకుడు. ఆయన్ని సీఎం గా అంతా చూశారు. ఆయన ఏంటో జనాలకు బాగా తెలుసు. అలాంటి బాబుని కొత్తగా చూపించి జనాల చేత మెప్పు పొందడం అంటే బిగ్గెస్ట్ టాస్క్ అనే చెప్పాలి. ఇక జగన్ అధికారంలోకి రావడానికి పీకే కొన్ని వ్యూహాలు ఇవ్వవచ్చు. వచ్చిన తరువాత అయిదేళ్ల పాలన అంతా ఆయన చేసినదే. ముఖ్యంగా హామీలు ఆయన తుచ తప్పకుండా అమలు చేశారు.

ఆ విధంగా ఆయన అనేక వర్గాలతో కూడా మమేకం అయ్యారు. బీసీ ఓటు బ్యాంక్ ని తన వైపుగా తెచ్చుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో జగన్ కట్టుకున్న కట్టుదిట్టమైన మేడను కూల్చడం అంటే పీకే వల్ల అవుతుందా అన్నది ఒక పెద్ద డౌట్. ఇక పీకేకు నాడు ఉన్న సొంత టీం అయితే నేడు లేదు. ఆయన పై లెవెల్ లో సలహాలు మాత్రమే ఇవ్వగలరు. గ్రౌండ్ లెవెల్ లో ఏమి జరుగుతుంది అన్నది ఆయనకు రాబిన్ శర్మ టీం నుంచే ఫీడ్ బ్యాక్ రావాలి. అది ఒక విధంగా ఆయనకు సెకండ్ గ్రేడ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది అని అంటున్నారు.

ఇక టీడీపీ ఒక ట్రెడిషనల్ పార్టీ నలభై ఏళ్ళ ఓల్డెస్ట్ పార్టీ. ఆ పార్టీ ఒక ఫిలాసఫీతో నడుస్తోంది. క్యాడర్ కూడా ఒక సిస్టమ్ కి అలవాటు పడ్డారు. పలుసార్లు అధికారంలోకి వచ్చిన అనుభవం వారికి ఉంది. దాంతో వారు పీకే వ్యూహాలను ఏ విధంగా గ్రౌండ్ లెవెల్ లో అమలు చేయగలరు అన్నది బిగ్ క్వశ్చన్. అంతే కాదు పీకే ఎంత క్లోజ్ గా మానిటరింగ్ చేసినా తక్కువ టైం లో ఆయన ఫలితాలు సాధించడం సాధ్యమేనా అన్నది కూడా ఒక ప్రశ్నగా ఉంది.

మొత్తానికి చూస్తే పీకే జగన్ మీద బాణం వేయబోతున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే జగన్ లో అతి పెద్ద వ్యూహకర్త ఉన్నారు. ఇపుడు ఆయన రాజకీయంగా రాటుదేలారు. ఆయన్ని ఎదుర్కోవాలి. అంతే కాదు చంద్రబాబు లో మరో రాజకీయ వ్యూహకర్త ఉన్నారు. ఆయన ఆలోచనలతో పీకే తన వ్యూహాలను మ్యాచ్ చేసి అమలు చేయించగలగాలి . ఏది ఎలా చూసుకున్నా పీకే ఈ టఫ్ టాస్క్ తీసుకుని ఏపీలో తాను అధికారంలోకి ఒక పార్టీని తెచ్చాను అన్న చోటనే మరో సక్సెస్ స్టోర్టీ ఇంకో పార్టీతో రాయబోతారా లేక ఏపీలో ఫస్ట్ టైం ఒక ఫెయిల్యూర్ స్టోరీతో వెనక్కి వెళ్తారా అన్నది చూడాలి.

ఎందుచేతనంటే తెలంగాణాలో పీకే కొన్నాళ్ళు పనిచేసి వేలు పెట్టినా బీఆర్ ఎస్ ఓటమి పాలు అయింది. ఆ మచ్చ ఆయనకు ఉంది. ఇపుడు ఏపీలో దాన్ని కంటిన్యూ చేసి సంపూర్ణం అనిపించుకుంటారా లేక గెలుపు బాటను పట్టి తనలో ఇంకా వ్యూహాలకు ఎదురు లేదని పదును పోలేదని నిరూపించుకుంటారా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.