Begin typing your search above and press return to search.

పీకే పలుకులు: జగన్‌ మళ్లీ గెలవడం కష్టం... కారణం ఇదే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   8 April 2024 5:18 AM GMT
పీకే పలుకులు: జగన్‌ మళ్లీ గెలవడం కష్టం... కారణం ఇదే!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే గతంలో ఒకసారి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పీకే... మరోసారి జగన్ ఫ్యూచర్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా... రానున్న ఎన్నిక్కల్లో జగన్‌ మళ్లీ గెలవడం కష్టం అంటూ జోస్యం చేప్పారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

అవును... ఏపీ సీఎం జగన్ పై ప్రశాంత్ కిశోర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైదరాబాద్ లో పీటీఐ ఎడిటర్స్ తో ముఖాముఖిలో మాట్లాడిన ఆయన... రానున్న ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలవడం కష్టమని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును పంచడం తప్పితే చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు. ఛత్తీస్‌ గఢ్‌ మాజీ ముఇఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ లాగా తాయిలాలివ్వడం తప్ప.. ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు.

ఇదే క్రమంలో... నగదు బదిలీ మాత్రమే చేశారని.. ఉద్యోగాలు కల్పించడంపైనా, అభివృద్ధి పథంలో పయనించడంపైనా ఏమాత్రం దృష్టి సారించలేదని అన్నారు. పూర్వ రాజ్యాలను పాలించిన చక్రవర్తులు కూడా తమ బర్త్ డే లకు, మ్యారేజ్ డే లకు ప్రజలకు ఇలానే పంచేవారని.. ఆ తరహాలోనే జగన్ కూడా కొన్ని తేదీలు ఫిక్స్ చేసి పంపకాలు చేస్తున్నారని పీకే చెప్పుకొచ్చారు. అందువల్ల.. ఇవి ఓట్లు తెచ్చిపెట్టవని, ఫలితంగా జగన్ ఓడిపోతారని అభిప్రాయపడ్డారు!

అదేవిధంగా... రాష్ట్రంలో అభివృద్ధి లేదనేది అంతా చెబుతున్న మాటేనని చెప్పిన పీకే... తాను కూడా దీనితో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో.. వాలంటీర్లు ప్రభుత్వాన్ని నిర్ణయించలేరని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా... వైఎస్ షర్మిళ, సునీత ల ప్రస్థావన రాగా... వారి విషయం తనకు తెలియదని చెబుతూనే, వారి ప్రభావం కూడా ఉంటుందని చెప్పడం గమనార్హం!

ఇదే సమయంలో... రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలపైనా పీకే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా... బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయని జోస్యం చేప్పారు! ఇదే క్రమంలో... తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మొదటి లేదా రెండో స్థానంలో నిలవొచ్చని అంచనావేశారు. అదేవిధంగా... ఒడిశాలో బీజేపీ నంబర్‌ వన్‌ గా నిలుస్తుందని.. పశ్చిమ బెంగాల్‌ లోనూ అత్యధిక సీట్లు సాధిస్తుందని.. తమిళనాడులోనూ ఆ పార్టీ ఓట్ల శాతం రెండంకెలకు చేరుకుంటుందని పీకే పలికారు!